- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టు వదలని బీఆర్‌ఎస్..! ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరోసారి హైకోర్టుకు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతున్నది. ఈ అంశంపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నది. ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ తేల్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు పలు దఫాలుగా విచారించి స్పీకర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా నేటి వరకు గడువునిచ్చింది. ఆ గడువు గురువారంతో ముగియనుండడం.. సుప్రీంకోర్టులో నేడు విచారణ ఉండడంతో స్పీకర్ బుధవారమే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారినట్లుగా ఆధారాల్లేవని, దీంతో ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు 8 మంది ఎమ్మెల్యేకు సైతం స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నది. ఇదే అంశాన్ని తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రకటించారు.
అనర్హత వేటు వేయాలని డిమాండ్..
బీఆర్ఎస్ నుంచి ఎన్నికై తర్వాత ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం లేదా పార్టీ మారడం వంటి చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన గులాబీ పార్టీ నేతలు.. దీనిని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు ద్రోహం చేశారని ఆరోపిస్తూ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టుకు వెళ్లి బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
పోరాడుతామని బీఆర్ఎస్ క్లారిటీ..
రాష్ట్రంలో గతంలోనూ ఫిరాయింపుల అంశం పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. అయితే, ఈసారి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఈ వ్యవహారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నది. పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఈ పోరాటం కొనసాగుతున్నదని చెబుతున్నారు. ప్రజలు ఒక పార్టీకి ఓటు వేసి గెలిపించాక ప్రజాప్రతినిధులు మధ్యలో పార్టీ మారడం ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధమని వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తీర్పు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కఠినంగా స్పందిస్తే భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ పరిణామాలకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం అసెంబ్లీ రాజకీయాల్లోనూ చర్చకు దారితీసే అవకాశముంది.
- Tags
- BRS High Court Case
- Telangana MLA Defection
- KTR Legal Battle
- Defection MLAs Case
- Telangana Politics
- Speaker Decision Challenge
- BRS vs Congress Telangana
- Anti-Defection Law
- 10th Schedule India
- Danam Nagender
- Kadiyam Srihari
- KCR Strategy
- Telangana Assembly News
- Supreme Court Guidelines
- Judicial Review
- Disha Web Desk
- Telangana Bureau
- Political Shifts Telangana
- MLA Disqualification Petition
- High Court Legal Fight






