సికింద్రాబాద్‌ జోలికి రావొద్దు! ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వానికి వార్నింగ్

by Ramesh Naini |

సికింద్రాబాద్‌ జోలికి రావొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వార్నింగ్ ఇచ్చారు.

సికింద్రాబాద్‌ జోలికి రావొద్దు! ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వానికి వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్‌ జోలికి రావొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. సికింద్రాబాద్ అంటే కేవలం ఒక పిన్ కోడ్ కాదని, ఒక బ్యూరో క్రాటిక్ బ్లాక్ అంతకన్నా కాదన్నారు. అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్‌లో గీసి పారేసే ఒక గీత అసలే కాదు.. ఇది 200 ఏళ్ల సజీవ చరిత్ర, మన సంస్కృతి, ఉమ్మడి జ్ఞాపకం.. ఎన్నో ఆధునిక నగరాల కంటే ముందే తనకంటూ ఒక విశిష్టమైన పౌర ఆత్మను (Civic Soul) సంతరించుకున్న నగరం మన సికింద్రాబాద్.. అని తెలిపారు.

"పునర్వ్యవస్థీకరణ" ముసుగులో సాంస్కృతిక విధ్వంసం

1806లో పురుడుపోసుకున్న సికింద్రాబాద్, తనదైన గుర్తింపుతో, ఒక ప్రత్యేక సంస్కృతితో ఎదిగిందన్నారు. హైదరాబాద్‌కు ‘ట్విన్ సిటీ’గా గర్వంగా భుజం భుజం కలిపి నిలిచిందని, ఇప్పుడు "పునర్వ్యవస్థీకరణ" అనే ముసుగులో ఆ పేరును తుడిచివేయాలని చూడటం లేదా దాన్ని వేరే దాంట్లో కలిపేయడం అంటే అది సాంస్కృతిక విధ్వంసమే.. అని ఆవేదన చెందారు. కేవలం పరిపాలనా సౌలభ్యం నెపంతో తరతరాల చరిత్రను కాలరాయడం ఎప్పటికీ సమర్థనీయం కాదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.

మీ ఇష్టానుసారం మార్చే హక్కు మీకు లేదు

మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచినంత మాత్రాన.. సికింద్రాబాద్ పౌర అస్తిత్వాన్ని మీ ఇష్టానుసారం మార్చే హక్కు మీకు లేదు.. అని ఆరోపించారు. మల్కాజిగిరి పేరుతో ఒక "ప్రత్యేక ఎంసీహెచ్" (Exclusive MCH) ఏర్పాటు చేసి, చారిత్రాత్మకమైన సికింద్రాబాద్ సరిహద్దులను బలవంతంగా మింగేయడం ఏకపక్షం, హాస్యాస్పదం, నియంతృత్వ ధోరణి అని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది అధికార దుర్వినియోగం, మితిమీరిన జోక్యం.. తరతరాలుగా ప్రజలు ప్రేమించి, గర్వంగా బతికిన ఆ చారిత్రక మూలాలను దారుణంగా చెరిపేసే ప్రయత్నం ఇది.. అని తీవ్ర ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్ పేరును, సంస్కృతిని, దాని గుర్తింపును కాపాడాలి, గౌరవించాలని అన్నారు. దాని ఉనికిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని అయినా సరే.. ఇక్కడి ప్రజలే కాదు, చరిత్ర కూడా ప్రతిఘటిస్తుంది.. సికింద్రాబాద్ జోలికి రావొద్దు.. దాసోజు శ్రవణ్ ఎక్స్ వేదికగా సూచించారు. ట్వీట్ ఇదే..

Next Story