Dasoju Sravan: ఆమె కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం పొంగులేటికి ఉందా?

by Gantepaka Srikanth |

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి భక్షిస్తున్నారని.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ మాఫియా నడువుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

Dasoju Sravan: ఆమె కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం పొంగులేటికి ఉందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి భక్షిస్తున్నారని.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ మాఫియా నడువుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 169,244,245 సర్వే నంబర్లలో 27 ఎకరాల భూమి సతీష్ షా కుటుంబ సభ్యులకు ఉన్నదని.. తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి అది అని తెలిపారు. 2017-18లో సతీష్ షా తల్లి ప్రమీలా దేవి మరణించారని.. భూ సరిహద్దులు సరిగా ఉంచుకునేందుకు 2018లో 245 ,169 సర్వే నెంబర్లలో సతీష్ షా కుటుంబ సభ్యులే మండల్ సర్వే కోరుకున్నారని చెప్పారు. వాళ్ల బంధువు అభినవ్ షాతో బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారని.. 2019లో రెండో సర్వే జరిగిందని.. హైకోర్టుకు వెళ్లారని.. 2021లో మళ్లీ సర్వే జరిగిందని చెప్పారు. అప్పుడు సైతం వివాదం లేదన్నారు. హెచ్ఎండీఏ 169 సర్వేలో పల్లవి షా తొమ్మిది గుంటల భూమి తీసుకున్నప్పుడు రూ.కోటి 90 లక్షల పరిహారం ఇచ్చిందని.. అప్పుడు సైతం వివాదం లేదని తెలిపారు. పొంగులేటి కొడుకు డెవెలప్మెంట్ కొరకు అభినవ్ షాతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచే వివాదం మొదలైందని చెప్పారు.

అలాగే.. 169లో అప్రోచ్ రోడ్ కోసం హర్ష, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీష్ షా, పల్లవి షా ఇంటికొచ్చారని.. భూమి ఇవ్వాల్సిందేనని పొంగులేటి అడిగారని.. కానీ, వారు తిరస్కరించారని తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదట రోడ్డు కోసం అడిగారని.. ఆ తర్వాత 2 ఎకరాలు భూమి అడిగారని.. తర్వాత మొత్తం భూమి డెవలప్‌మెంట్ కోసం అడిగారని వెల్లడించారు. వారిని బెదిరించడానికే పొంగులేటి వారి ఇంటికి వెళ్లారని ఆరోపించారు. పొంగులేటి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెవెన్యూ అధికారులతో సతీష్ షా, పల్లవి షా భూముల్లో సర్వే డ్రామా మొదలు పెట్టారని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పల్లవి షాను బెదిరించి బలవంతంగా సంతకం తీసుకున్నారని ఆరోపించారు. ఇది 2025 అక్టోబర్ 7న జరిగిందన్నారు. పొంగులేటి పల్లవి షా కళ్లలోకి చూసి పెట్టి మాట్లాడగలరా? సతీష్ షా కుటుంబసభ్యులతో చర్చకు పొంగులేటి అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తారా అని సవాల్ విసిరారు.

Next Story