- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందాల పోటీలతో తెలంగాణ సంస్కృతిని కించపరిచారు: ఎమ్మెల్సీ దాసోజు
అందాల పోటీలు భారత సంస్కృతిని కించపరిచేలా జరిగాయని.. సీఎం రేవంత్‌రెడ్డి దేశానికి, రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అందాల పోటీలు భారత సంస్కృతిని కించపరిచేలా జరిగాయని.. సీఎం రేవంత్‌రెడ్డి దేశానికి, రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మెగీ అందాల పోటీల నుంచి అవమానకార పద్ధతుల్లో వైదొలిగిన తీరు రాష్ట్ర ప్రతిష్టను మంట గలిపిందన్నారు. సీఎం ఇప్పటికే చెంపలు వేసుకుని మిస్ ఇంగ్లాండ్‌కు క్షమాపణ చెప్పి ఉండాల్సిందన్నారు. ఇతర దేశాల్లో ఇలాంటిది జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారని.. ఇంత పెద్ద ఘటన జరిగినా ప్రభుత్వ పెద్దలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందరూ ఇండో పాక్ యుద్ధంపై ఉత్కంఠగా చూస్తుంటే రేవంత్ అందాల పోటీల వైపే మొగ్గారని విమర్శించారు. అందాల పోటీలను రేవంత్ కుటుంబ వ్యవహారంగా మార్చారని అన్నారు.
అందాల భామలు మరోసారి రాష్ట్రానికి రమ్మన్నా రారని మంత్రి పొన్నం ప్రభాకరే చెప్పారని అన్నారు. ఈ కేసుపై హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్ కమిషన్ సుమోటోగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. భారత్ మాతాకీ జై అనే హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మహిళకు జరిగిన అవమానంపై స్పందించరా అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య బలమైన బంధం ఉండడంతోనే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రమోషన్ కోసం అందాల పోటీలు వ్యవహరించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఈ పోటీల్లో ఎందుకు చొరబడ్డారని నిలదీశారు. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టే వరకూ ఊరుకునేది లేదన్నారు. ఆర్‌టీఐ కింద ఇప్పటికే దరఖాస్తు చేశామని, సోనియా, ప్రియాంక సైతం ఈ ఘటన మీద స్పందించాలన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై పోలీసుల దమనకాండ సరైంది కాదన్నారు. రేవంత్‌రెడ్డి తన ఇష్టమొచ్చినట్టు భూ సేకరణ చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.






