- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిపక్షాలను "బడవ" అని తిడుతుండు! రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బహిరంగ లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శలు చేస్తూ లేఖ రాశారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను భంగపరిచే విధంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను “బడవ” వంటి పదాలతో బూతులు తిడుతూ ప్రజాస్వామ్య దేవాలయాన్ని 'బూతుల కబేళా'గా మారుస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.
చిన్నారుల ముందే అసభ్య పదజాలం
అలాగే “తోలు తీస్తా”, “పేగులు మెడలో వేసుకుంటా” వంటి కసాయి భాషతో సర్పంచులను భయభ్రాంతులకు గురిచేయడం, చిన్నారుల ముందే మాజీ ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం వాడటం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి భాషా ప్రయోగాలు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న ‘మొహబ్బత్ కీ దుకాణ్’ భావజాలానికి పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. పాలనను 'గల్లీకరణ' చేస్తూ, రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కడం మీ పార్టీ సిద్ధాంతమా? ప్రశ్నించారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.






