తెలంగాణ మరోసారి మర్లబడ్తది జాగ్రత్త.. CM రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-21 14:38:44  IST  )

మట్టి మనుషుల కష్టాలను తెలుసుకునే నాయకుడు కేసీఆర్(KCR) అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు.

తెలంగాణ మరోసారి మర్లబడ్తది జాగ్రత్త.. CM రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: మట్టి మనుషుల కష్టాలను తెలుసుకునే నాయకుడు కేసీఆర్(KCR) అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే వ్యవసాయాన్ని పండుగ చేసి.. రైతుకు కుడిభుజంగా నిలిచాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆ మహానేతను లక్ష్యంగా చేసుకొని విచారణ పేరుతో ప్రస్తుత సర్కారు ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ మరోసారి మర్లబడడం ఖాయమని హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కేసీఆర్‌పై కుట్రలకు తెరలేపిందని, సర్కారు చేతకాని తనాన్ని, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచారని, రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేశారన్నారు.

ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని, రైతుల సాగునీటి గోస తీర్చేందుకు భగీరథుడిలా కంకణం కట్టుకున్నారన్నారు. తద్వారా తెలంగాణను ధాన్యాగారంగా మారిందని, దీనిని దేశంతోపాటు మిగతా దేశాలు మెచ్చుకున్నాయ న్నారు. కేసీఆర్ గుర్తులు చెరపాలనుకుంటే ఇంకా ఎదుగుతారనే విషయాన్ని మరువొద్దన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు కేసీఆర్ పాలననే గుర్తు చేసుకుంటున్నారని, రాష్ట్రానికి ఎవరు వచ్చినా ఇక్కడి కట్టడాలను, జరిగిన అభివృద్ధికి, ఇందుకు కారణమైన కేసీఆర్‌ను అందరూ గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు, కేసీఆర్‌కు ఉన్న ఇమేజ్‌ను ఓర్వలేకనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విచారణ పేరుతో ఆయనకు నోటీసులు ఇస్తున్నారన్నారు. ఇంత చేసినందుకా కేసీఆర్‌కు నోటీసులు అని, ముమ్మాటికీ కాంగ్రెస్ కక్ష సాధింపు నోటీసులుగానే పరిగణిస్తామన్నారు. ప్రజలు అన్నివేళలూ కేసీఆర్‌తోనే ఉన్నారు. ఆయనను అడ్డుకోవాలన్న ప్రతి ప్రయత్నం చివరికి ప్రజలే తిప్పికొడతారని హెచ్చరించారు.

Next Story