గత పాలనలో ఉన్న పెండింగ్​ పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-05 15:48:57  IST  )

గత పాలనలో ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు.

గత పాలనలో ఉన్న పెండింగ్​ పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
X
  • గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా నిర్మించాలి
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్​, అదనపు వైద్యులను నియమించాలి
  • బీసీలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మించి వారికి అండగా నిలవాలి
  • ఆడ పిల్లలపై జరుగుతున్న వివక్షతపై పాట పాడిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
  • పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ అందజేయాలి : కాటేపల్లి
  • జర్నలిస్టులు అక్రిటేషన్​కార్డులను తగ్గింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి : మహేశ్వర్​రెడ్డి
  • ఖమ్మం జిల్లాలో హత్యగావింపబడిన సామినేని రామారావు మరణంపై సిట్​విచారణ చేపట్టాలి : కూనంనేని

దిశ, తెలంగాణ బ్యూరో : గత పాలనలో ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని శాసనసభలో పలువురు ఎమ్మెల్యేలు కోరారు. సోమవారం జీరో అవర్​లో తమ నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సీసీ రోడ్లు, కాలనీలో హైటెన్షన్​వైర్లను తొలగించి, డ్రైనేజీ నిర్మాణాలు, తాగునీరు కోసం కొత్త పైపులైన్లు వేయాలని పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెట్​వసతి ఉండేలా యార్డులు ఆధునీకరణ చేయాలని, అన్నదాతలు మోసం చేసే దళారుల పట్ల కఠిన నిర్ణయాలు ఉండాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వం కార్యాలయాలతో పాటు బడుల్లో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పెండింగ్​బిల్లులను త్వరగా విడుదల చేయాలని కోరారు. వాగుల్లో చెక్​డ్యామ్​ల నిర్మాణాలు చేపట్టి వరద జలాలు నిల్వ ఉండేలా చూడాలన్నారు. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని, వారు ఒకే దగ్గర ఉండి సమస్యలు చర్చించేందుకు వేదికలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, భవనాలు నిర్మిస్తే బీసీ కులాలు కాంగ్రెస్​ప్రభుత్వానికి అండగా ఉంటారని మహబూబ్​నగర్​ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వాటికి తగిన నిధులు మంజూరు చేయాలన్నారు. కంటోన్మెంట్​నియోజకవర్గం జీహెచ్ఎంసీలో కలపాలని, ఆ ప్రాంతమంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండటంతో మోడీ సర్కార్​నిధులు మంజూరు చేయకపోవడంతో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ద్విచక్ర వాహనాలు కూడా సక్రమంగా నడిచే పరిస్థితి లేదన్నారు. అక్కడ జరగాల్సిన బోర్డు ఎన్నికలు కూడా వాయిదా పడటంతో బోర్డు ఒక్క రూపాయి నిధులు ఇవ్వడం లేదని వాపోయారు. వెంటనే ప్రభుత్వం కంటోన్మెంట్​నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్​కోరారు.

మండల కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో సరిపడా వసతులు లేవని, పేదలు వైద్యం కోసం రాజధాని నగరానికి రావాల్సి వస్తుందని, ప్రాథమిక కేంద్రాల్లో ల్యాబ్ లు, ఎక్స్​రే మిషన్లు మంజూరు చేస్తే వైద్య సేవలు అందుతాయని, నర్సులు, వైద్యులు కూడా తగిన విధంగా నియామించాలని ఎమ్మెల్యేలు జైవీర్​రెడ్డి, మేడిపల్లి సత్యం, ధనపాల్​సూర్యనారాయణ గుప్త, ఆది శ్రీనివాస్, రాంచందర్​నాయక్, మురళీ నాయక్​, మనోహర్​రెడ్డి, పటోళ్ల సంజీవ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి కోరారు. జడ్చర్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్​కేంద్రంగా చేయాలని, మరో రెండు మండలాలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే అనిరుద్ధ్​రెడ్డి సూచించారు. ఈసందర్భంగా జారే ఆదినారాయణ ఆడపిల్లనమ్మ... పాడు పిల్లనమ్మా పాట పాడి చిన్నారులకు జరిగే అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్​వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తూ పేదల గుండెల్లో చెరగని ముద్ర రేవంత్​ప్రభుత్వం వేసుకుందని పేర్కొన్నారు. చివరగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ ఖమ్మంలో ఇటీవల సీపీఎం నేత సామినేని రామారావు హత్యగావించారని ఇప్పటివరకు బాధ్యులు ఎవరో తేల్చలేదని, అతని మరణంపై మిస్టరీ వీడేందుకు ప్రభుత్వం సిట్​ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్​చేశారు. సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో ఉండి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.

పదవి విరమణ బెనిఫిట్స్ ​త్వరగా ఉద్యోగులకు ఇవ్వాలి : కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, మహేశ్వర్​రెడ్డి

రాష్ట్రంలో రెండేళ్ల నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్​ప్రభుత్వం చెల్లించడం లేదని, వారు నెల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్ధితి వచ్చిందని కాటేపల్లి వెంకరమణ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.13,500 కోట్ల వరకు పెండింగ్​ఉన్నాయని వాటిని ప్రభుత్వం ఎప్పడు చెల్లిస్తుందో చెప్పాలని డిమాండ్​చేశారు. ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల కోసం రూ.30 వేలు ఇచ్చేవారిని, కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని ఇవ్వడం లేదని వెంటనే వాటిని ప్రతి ఉద్యోగికి ఇవ్వాలన్నారు. సరెండర్​లీవులకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని, ఉద్యోగులు సకాలంలో ఇవ్వాల్సిన నగదు ఇస్తే అడ్డదారుల్లో లంచాలు తీసుకోవాల్సిన ఉండదన్నారు. ఈమధ్యకాలంలో చాలామంది ఉద్యోగులు ఏసీబీకి చిక్కి తమ జీవితాలను అంధకారం చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులకు గతంలో 13 వేలు కార్డులు మంజూరు జరిగింది. ఈ ప్రభుత్వం వాటిని సగానికి తగ్గించడం సరికాదని, వెంటనే గతంలో ఉన్న విధంగా ఇవ్వాలని డిమాండ్​చేశారు. రజక, నాయీ బ్రాహ్మణ కులాలకు గతంలో ప్రభుత్వం ఉచితంగా విద్యుత్​సరఫరా చేసింది. వాటిని ఇప్పటివరకు ఈ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఒక్కొక్కరికి రూ.15 వేలకు పెండింగ్​లో ఉన్నాయని వాటిని రేవంత్​సర్కార్​మాఫీ చేయాలని పాయల శంకర్​కోరారు.

Next Story