‘ఆ బాధ్యత మా మీదా ఉంది.. దయచేసి అవకాశం కల్పించండి’: అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్‌ విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-29 10:16:30  IST  )

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) కలిశారు.

‘ఆ బాధ్యత మా మీదా ఉంది.. దయచేసి అవకాశం కల్పించండి’: అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్‌ విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) కలిశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎల్పీకి కల్పించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. స్పీకర్‌ను అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోయ కేపీ వివేకాందన్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం. రమేష్ కుమార్ రెడ్డి ఉన్నారు.

లేఖలో ఏముందంటే...

‘‘శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రజల ముందు వాస్తవాలను ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ లేఖ రాస్తున్నాము. తెలంగాణ నేల నుంచి కరువును పారదోలిన ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్పథకం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుతం అనేక అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. గత కొద్ది నెలలుగా తెలంగాణ మీద గుడ్డి వ్యతిరేకతతో కొన్ని తెలంగాణ వ్యతిరేక, అభివృద్ధి నిరోధక శక్తులు కాళేశ్వరం పైన విపరీతమైన అపోహలను సృష్టించేలా దుష్ప్రచారం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు, దీని వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు, వివిధ దశల్లో జరిగిన పనులు, సాంకేతిక అంశాలు మరియు ఈ ప్రాజెక్టుతో ముడిపడిన అనేక ఇతర అంశాలను ప్రజల ముందు ఉంచడం ఈ సమయంలో చాలా అవసరం. ఈ సమాచారాన్ని ప్రజలకు స్పష్ట మైనరీతిలో అందించడంద్వారా, ప్రాజెక్టుపై ప్రచారం చేస్తున్న అవాస్తవాలను తొలగించవచ్చని, ప్రజల ముందు నిజాలను ఉంచవచ్చని మేము బలంగా నమ్ముతున్నాము.. రాష్ట్ర అత్యున్నత చట్ట సభ అయిన శాసన సభ సభ్యులందరికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, ప్రాధాన్యత తెలియాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓ వైపు పక్కరాష్ట్రం బనకచర్ల పేరిట, కేంద్ర ప్రభుత్వం గోదావరి - కావేరీ లింక్ పేరిట గోదావరి జలాలపై తెలంగాణకున్న హక్కులను కాలరాసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి పై ఉంది.

కాబట్టి, ఈసారి జరగనున్న శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వాస్తవాలను, గణాంకాలు, ఆధారాలతో సహా విశ్లేషణాత్మకంగా వివరించడానికి మాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాము. దీని కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చేందుకు దయ చేసి మాకు అనుమతి ఇవ్వగలరని ఆశిస్తున్నాము. గతంలో ప్రభుత్వం శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిన మీ గురుతర బాధ్యతను గుర్తుచేస్తూ ప్రజలకు నిజాలు తెలిపేందుకు పవిత్రమైన శాసన సభలో ఎలాంటి పక్షపాతం లేదనే సంకేతాన్ని ఇస్తూ మాకు పీపీటీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజా స్వామ్యవ్యవస్థలో ప్రతిపక్షానికి ఉన్న హక్కులను, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన మా బాధ్యతను పరిగణనలోకి తీసుకుని, మా అభ్యర్ధనను మన్నించగలరని సవినయంగా కోరుతున్నాము’’ అని లేఖలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Next Story