నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసాను కవితకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-12-09 10:54:19  IST  )

కవిత వర్సెస్ బీఆర్ఎస్ వార్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో చర్చనీయాశంగా మారింది.

నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసాను కవితకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్ లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యవహారం చర్చనీయాశంగా మారింది. కన్న తండ్రిని, అయిన వారిని విభేదించి నాదారి నేను వెతుక్కుంటున్నాను అంటూ జనం బాట పట్టిన కవిత రాజకీయ ప్రయాణం సస్పెన్స్ గానే ముందుకు సాగుతోంది. హరీశ్ రావు, సంతోశ్ రావులపై ఆరోపణలతో ఎటాక్ మొదలు పెట్టిన కవిత ఇప్పుడు ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. కవిత కామెంట్స్ బీఆర్ఎస్‍ను, కేసీఆర్‍ను ఇరుకున పెట్టేలా ఉండటంతో ఇక గులాబీ నేతలు కవితపై విమర్శల డోస్ పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన రచ్చగా మారాయి. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వైపు నుంచి అంతే స్ట్రాంగ్ కౌంటర్లు రావడంతో ఇప్పుడు కవిత వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం రంజుగా మారింది.

నీ లాంటి కుక్కలను మస్తు మందిని చూసాను:

ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించిన కవిత ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో కూకట్‍పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కవిత చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆయన భూ కబ్జాలపై పెట్టిన దృష్టి ప్రజలపై పట్టి ఉంటే బాగుండేదని అన్నారు. కవిత ఆరోపణలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నేను కవిత కబ్జాల చిట్టా విప్పితే దారుణంగా ఉంటుందని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా నీ లాంటి కుక్కలను మస్తు మందిని చూశానని నీకు ఎవడు భయపడతాడు అంటూ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీ అక్రమాలు, నీ మొగుడి అక్రమాలు బయటకు తీస్తే తట్టుకోలేరని ఇకనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బంద్ చేసి ప్రజా సేవ చేయడం నేర్చుకో అన్నారు. బట్టల షాపులు, బంగారం షాపులు వదలని నీవు నన్ను కబ్జాతారుడని అంటావా అంటూ ఫైర్ అయ్యారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసని నీ అత్తగారి ఊర్లో నీకు గెలవడం చేతకాలేదని దుయ్యబట్టారు. కేటీఆర్, హరీశ్ రావును జైలుకు పంపాలని రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర చేస్తున్న సంగతి మాకు తెల్వదు అన్నుకున్నావా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీ అక్రమాలు తీస్తే తల ఎక్కడ పెట్టుకుంటావు అని ప్రశ్నించారు. కేసీఆర్ దేవుడని ఆయన పేరును, పార్టీని సర్వనాశనం చేయాలని చూస్తోందన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలేవ్ అంటూ కౌంటర్ ఇచ్చారు.

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లికి లాభం!:

కవిత వ్యాఖ్యల సెగలు బీఆర్ఎస్‍లో రాజకీయ వేడి రాజేస్తోంది. గత పదేళ్లు అధికారంలో ఉండగా గులాబీ పార్టీలో జరిగిన అవినీతి, అక్రమాలను బహిరంగంగా కామెంట్ చేస్తోంది. దాంతో ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతుంటే కవిత వ్యాఖ్యలను కంట్రోల్ చేసే పరిస్థితి బీఆర్ఎస్ వైపు నుంచి లేకుండా పోయింది. ఈ క్రమంలో పలువురు కవిత వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసినా తాజాగా మాధవరం కృష్ణారావు మాత్రం ఘాటు వ్యాఖ్యలతో రియాక్ట్ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. కవిత ఇంతలా బీఆర్ఎస్‍ను లక్ష్యంగా చేసుకుంటుంటే అధికారంలో ఉండగా ఇవేవి చెప్పకుండా ఇప్పుడు నీ స్వార్థం కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా పిట్ట పోరు పిట్టపోరు పిల్లికి లాభం అన్న చందంగా బీఆర్ఎస్ వర్సెస్ కవిత ఇష్యూ తయారైందని కవిత వ్యాఖ్యలతో ఆమెకు మైలేజ్ కంటే డ్యామేజే ఎక్కువ అనే చర్చ కూడా జరుగుతోంది. జాగృతి జనం బాట పేరుతో జిల్లాల బాట పట్టినప్పటికీ బడా నేతలంటూ ఇప్పటి వరకు ఎవరు కూడా కవిత వైపు వచ్చి చేరలేదు. ఆమెపై ఉన్న లిక్కర్ కేసు వంటి ఆరోపణలతో భవిష్యత్ లోనైనా వస్తారా అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇక ఒక్కొక్కరుగా కవితపై విమర్శల స్వరం పంచుతున్న క్రమంలో కవిత ఫ్యూచర్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.

Next Story