- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగచాటున హైదరాబాద్ మహానగర విభజన బిల్లు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు
హైదరాబాద్ మహానగర విభజన బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం దొంగచాటున అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగర విభజన బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం దొంగచాటున అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మట్లాడారు. రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించిన వివేకానంద గౌడ్, సీఎంకు కలెక్షన్ల మీద తప్ప పాలనపై ఎలాంటి ధ్యాస లేదన్నారు. హైదరాబాద్ విభజన అంశంలో ప్రజల మనోభావాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అనుభవరాహిత్యంతో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, దాని ఫలితంగానే మహానగర విభజన గందరగోళంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే హైదరాబాద్ విభజనపై గొంతెత్తుతున్నారని, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సైతం అసెంబ్లీలో దీనిపై నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కుక్కలు చించిన విస్తరిలా..
హైదరాబాద్‌ను కుక్కలు చించిన విస్తరిలా మార్చే ప్రయత్నం జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన, గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి కూడా లేని పరిస్థితి ఉందన్నారు. విభజనపై మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో కనీసం సంప్రదింపులు జరపలేదని, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా సమగ్ర చర్చ లేకపోయిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మహానగర సంస్థలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదని వివేకానంద గౌడ్ తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ మహానగర విభజనను గందరగోళంగా చేపడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేసిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి తన దృష్టిని పాలనపై పెట్టాలని డిమాండ్ చేశారు.






