కేసీఆర్ మల్లెపువ్వులాగా తిరిగొస్తారు.. జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ మల్లెపువ్వులాగా తిరిగొస్తారు.. జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్‌తో అర్థశతకం పూర్తి అయింది. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి 50 పైసలు తేలేదు. కానీ ఇప్పటివరకు ఢిల్లీ పర్యటనల పేరిట ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు ఖర్చుచేసింది. ఇందులో రూ.2 లక్షల కోట్ల అప్పు ఉంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏటీఎంలా మారిందని గతంలో మోడీ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తోంది. పదేళ్ల కాలంలో కేసీఆర్ పదిసార్లు ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ రెడ్డి 20 నెలల కాలంలో నెలకు రెండు సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారని జగదీశ్ రెడ్డి విమర్శలు చేశారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే గొప్పగా ఉంటుందని నమ్మి ప్రజలు, రైతులు ఓట్లు వేశారు. కానీ రైతుల మోటార్లు కాలిపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రులు నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఉన్న పరిస్థితులు మళ్ళీ తెలంగాణలో వచ్చాయి. ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాను వాడుకుని బీఆర్ఎస్ హయాంలో తమపై బురదజల్లారు. ఇప్పుడు మీడియాను చూస్తే కాంగ్రెస్ నేతలే భయపడుతున్నారు. గతంలో కాంగ్రెస్‌కు ఇష్టమైన ప్రాంతం అశోక్ నగర్.. కానీ ఇప్పుడు అశోక్ నగర్ అంటే రేవంత్ రెడ్డికి భయం పుడుతోందని జగదీశ్ రెడ్డి సెటైర్ వేశారు.

మీటింగ్‌కు రావడం లేదని సోనియా గాంధీ లెటర్ రాస్తే అది అవార్డు అని సీఎం అంటున్నారు. తెలంగాణ ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం కోమాలోకి వెళ్లాయి. తెలంగాణ ప్రజల జేబులు కొట్టి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి కప్పం కడుతున్నారు. 50వ పర్యటనలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను చూస్తే నవ్వొస్తుంది. ఆయన మహా జ్ఞానిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బనకచర్ల అంటే ఏంది అనేది ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్‌కు తెలియదని విమర్శించారు.

కేవలం బీఆర్ఎస్‌ను బద్నాం చేయడానికే ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ, కాళేశ్వరం కమిషన్ అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేమే.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చింది మేమే. తెలంగాణను పంటల విస్తీర్ణంలో మొదటి స్థానంలో నిలిపింది మేమే.. ఒక్కచోట కూడా అవినీతి చేయలేదు. చేయనీయలేదు. కేసీఆర్ మల్లెపువ్వులాగా తిరిగి వస్తారు అని నిరూపిస్తాం అని జగదీశ్ రెడ్డి అన్నారు.

Next Story