బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం కొందరి కుట్ర.. మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతున్నది అనేది కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు.

బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం కొందరి కుట్ర.. మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతున్నది అనేది కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆలోచనలు తనకు తెలుసని.. ప్రజలు ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని అన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగిందని.. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్‌ను స్థాపించారని తెలిపారు.

కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందన్నారు. ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు, వైఎస్ఆర్‌ను కేసీఆర్ ఎదుర్కొన్నారని తెలిపారు. రాష్ట్రం సాధించి కేసీఆర్ సీఎం అయ్యి అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని అన్నారు. కేసీఆర్ సీఎంగా లేనందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలన చర్చకు వస్తే ఆ రెండు పార్టీల రాజకీయ పునాదులు కదులుతాయన్నారు. కేంద్ర మంత్రుల భాష, వారి పాలన ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. జూన్ 2న తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని తెలిపారు. పార్టీలో ఏ నిర్ణయం అయినా కేసీఆర్ తీసుకుంటారని చెప్పారు. సోమవారం భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని వెల్లడించారు.

Next Story