ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై బీఆర్ఎస్ నేతల మౌనం.. ఇంతవరకు ఒక్క నేత కూడా నోరు విప్పకపోవడానికి రీజన్ ఏంటి?

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. విచారణలో పొరుగు రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ ఆనవాళ్లు బయటపడ్డాయి.

ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై బీఆర్ఎస్ నేతల మౌనం.. ఇంతవరకు ఒక్క నేత కూడా నోరు విప్పకపోవడానికి రీజన్ ఏంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. విచారణలో పొరుగు రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో ఈ అంశం రెండు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగు చేసినట్టు విచారణలో అధికారులు ఒప్పుకున్న దాఖలాలూ ఉన్నాయి. అయితే.. ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ వైఖరిపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. కాళేశ్వరం మీద వేసిన కమిషన్ విచారణ, ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో ఏసీబీ ఎంక్వయిరీపై గులాబీ దండు ఊగిపోయింది. విచారణకు వెళ్తూ కూడా తమ బలాగాన్ని చూపించుకున్నది. కానీ రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఫోన్లు ట్యాపింగ్ చేసిన అంశంపై మాత్రం బీఆర్ఎస్ నేతలు సైలెంటుగా ఉండిపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కానీ.. ఇతరత్రా ఏ స్థాయి లీడర్ కానీ ఈ అంశంపై ఇంతవరకు నోరు విప్పింది లేదు. దీని వెనుక ఉన్న పరామర్థం ఏంటనే విషయమై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజురోజుకూ మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పొలిటికల్ లీడర్లతోపాటు కాంట్రాక్టర్లు, సినీ హీరోయిన్లు, వ్యాపారవేత్తలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలున్నాయి. అయితే.. బాధితులందరినీ సిట్ ఎంక్వయిరీ చేస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ నేతలు సైతం సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా 2018లో తాము అధికారంలోకి రాకపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీ విమర్శలు..

గతంలో ఫోన్ ట్యాపింగ్‌కు గురైన వారు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అటు బీజేపీ, కాంగ్రెస్ బాధిత నేతలు సైతం ఈ విషయంపై గట్టిగానే స్పందిస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలోని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు వీరే ప్రధాన కారణమంటూ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగులకు పాల్పడి ఎంతో మందికి సంబంధించిన సీక్రెట్స్ విన్నారని.. అంతేకాకుండా తమ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా వీరేనంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సైతం విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. అలాగే.. వారం రోజుల్లోపే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం విచారణకు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. అయితే.. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్‌పై ఇరు పార్టీలు దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.

బీఆర్ఎస్ సైలెంట్ ఎందుకు?

రాష్ట్రవ్యాప్తంగా అన్నిపార్టీల వేళ్లు బీఆర్ఎస్ నేతల వైపే చూపిస్తున్నప్పటికీ.. గులాబీ దండు ఎందుకు సైలెంటుగా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చీటికిమాటికి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రధాన ప్రతిపక్ష పార్టీ.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం మౌనం పాటించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా భావించాల్సిందేనా అని టాక్ నడుస్తున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా ఈ విషయమై కనీసం స్పందించడం లేదు. అటు పార్టీ నుంచి మధ్య, కింది స్థాయి లీడర్లు కూడా ఈ ప్రస్తావన తీయడం లేదు. ‘తప్పు చేసింది తామే కాబట్టి.. ఎలాగూ తమ మెడకు చుట్టుకోక తప్పదు అని.. అందుకే స్పందించకూడదు అని ఫిక్స్ అయ్యారా’ అన్న చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా.. కేటీఆర్ నుంచి కూడా దీనిపై స్పందన కరువైంది.

కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ పై దూకుడు

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డకు సంబంధించి రెండు పిల్లర్లు కుంగాయి. అలాగే.. గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.45 కోట్ల వరకు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఈ రెండింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నది. ఇటు ఫార్ములా కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తున్నది. అయితే.. ఈ రెండు కేసుల మీద బీఆర్ఎస్ నేతలు ఎంతగానో దూకుడు ప్రదర్శించారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ దండును తీసుకొచ్చారు. తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా.. అసలు కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్టులో రెండు పిల్లర్లకు మాత్రమే డ్యామేజీ జరిగిందని.. మిగతా అంతా కూడా బాగానే ఉందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. తాము ఎక్కడా తప్పుచేయలేదని ప్రెస్‌మీట్లు పెట్టి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి హడావిడి చేశారు. ఇక.. ఫార్ములా కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. ఇదో లొట్టపీసు కేసు అంటూ కామెంట్స్ చేశారు. అసలు ఇందులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని పార్టీలూ బీఆర్ఎస్‌ను కార్నర్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎందుకు రిప్లయ్ ఇవ్వడం లేదన్న చర్చ ప్రధానంగా వినిపిస్తున్నది.

Next Story