- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM కంటే ముందే మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. ఆసక్తిగా మారిన సందర్శన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకంగా భావించే మేడిగడ్డ బ్యారేజీ చుట్టూ రాజకీయ హీట్ పెరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకంగా భావించే మేడిగడ్డ బ్యారేజీ చుట్టూ రాజకీయ హీట్ పెరిగింది. ఈ నెల 18న బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు వెళ్లి పరిస్థితులను పరిశీలించనుండగా.. 20న ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో ఈ సందర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా వీరు సందర్శించనున్నారు. ఇటీవల ఈ మూడు బ్యారేజీల పరిస్థితిపై వస్తున్న వార్తలు, సాంకేతిక అంశాలపై నెలకొన్న సందేహాల నేపథ్యంలో ప్రాజెక్టు స్థితిగతులను స్వయంగా పరిశీలించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, నిర్మాణ నాణ్యత, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై బీఆర్ఎస్ నేతలు అధికారులను ప్రశ్నించే అవకాశమున్నదని సమాచారం.
ఇదే సమయంలో ఈ నెల 20న సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డకు వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను స్వయంగా పరిశీలించి.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు భద్రత, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వివిధ ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. బీఆర్ఎస్ నేతలు, సీఎం పర్యటనలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ బృందం ముందస్తు సందర్శనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. సీఎం పర్యటనకు ముందే అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.






