- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ పేరు పలకడానికే బీఆర్ఎస్ నేతలు వణుకుతున్నారు: ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో రైతు ప్రభుత్వం, రైతు పాలన జరుగుతోందని, రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడ్డారని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రైతు ప్రభుత్వం, రైతు పాలన జరుగుతోందని, రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడ్డారని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు కాళ్లలో ముళ్లు కుచ్చుకుంటే పంటితో తీస్తామని మేం కేసీఆర్ లా కబుర్లు చెప్పడం లేదని, రైతులకు మేలు చేసి చూపిస్తున్నాం.. వాళ్లకు అన్ని దశల్లో అండగా నిలుస్తున్నామన్నారు. రైతు డిక్లరేషన్ లో చెప్పింది చేస్తున్నాం, ఇంకా ఏమైనా మిగిలితే చూసి చూపిస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు. మాది రైతు డెడికేషన్ ప్రభుత్వం, రేవంతన్న స్వయంగా రైతన్న.. రైతు బిడ్డ.. అన్నదాతల కష్టాలు, కన్నీళ్లు బాగా తెలుసన్నారు. పండిన పంట మొత్తం కొనుగోలు చేశామని, ఈ యాసంగి సీజన్ లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మూడు రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. మొక్కజొన్న, జొన్నతో పాటు మిగిలిన పంటలను కూడా కొనుగోలు చేశామని, కేంద్రం కొనుగోలు చేస్తే కేసీఆర్ తెలివిగా తామే ఆ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకున్నాడని, కానీ, ఇప్పుడు కేంద్రం మాట మార్చింది.. రైతులు పండించే పంట మొత్తాన్ని కొనుగోలు చేయలేదు.. కేవలం మద్దతు ధర ప్రకటించి వదిలేస్తుందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించే మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోందని, హరీశ్‌రావు మాత్రం సోయి లేకుండా రాజకీయాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, రైతులు పండించిన మొత్తం పంటలను కేంద్రమే కొనుగోలు చేయాలని ఎందుకు హరీష్ రావు మాట్లాడటం లేదు? ఆయన నిలదీశారు. రైతన్నలకు అండగా నిలబడమని మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదు? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అన్న పదం హరీష్ రావు, కేటీఆర్ నోటి వెంట రావడం లేదని, మోడీ పేరు ఉచ్ఛరించడానికే వీరు వణికిపోతున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తాను రైతు అని చెప్పుకునే కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని, ఫాంహౌస్‌లో కాలక్షేపం చేస్తున్న ఆయన మా రైతుల ఉత్పత్తులను కోనుగోలు చేయాలని, ఎరువులను కేటాయించాలని కనీసం లేఖ రాయలేరా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతుల గురించి ఇసుమంత కూడా కేసీఆర్‌కు పట్టదా? రైతులు ఓట్లు వేస్తే గెలిచి పదేళ్లు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్‌కు వాళ్ల కష్టాలు పట్టవా? అని ఆయన నిలదీశారు. కోతలు లేకుండా ఎరువులు సప్లయ్ చేయాలని కేంద్రాన్ని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నిలదీయడం లేదు..? కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ల గల్లా పెట్టి ఎందుకు ప్రశ్నించడం లేదని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
రైతు భరోసా, బోనస్ పైన ఉద్దేశపూర్వకంగా హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఈ నెల 30 నుంచి ఈ సీజన్ కోసం మధిర నుంచి రైతు భరోసా మొదలు పెడుతున్నామని, గత వానాకాలం సీజన్ లో రైతులకు రూ. 2000 కోట్ల బోనస్ ఇచ్చామన్నారు. ఈ సారి కూడా బోనస్ కోసం 7 రకాల సన్న వడ్ల విత్తనాలను ప్రభుత్వం ప్రకటించిందని, రైతులు ఈ విత్తనాలను వేసి బోనస్ తీసుకోవాలి... విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ యాసంగి సీజన్ లో పంటలు సంవృద్ధిగా పండాయని, పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది.. మొక్క జొన్న దిగబడి ఊహించనంతగా వచ్చింది... రైతులు సంతోషంగా ఉన్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. హరీశ్‌రావు, కేటీఆర్ కుప్పిగంతులు వేసినంత మాత్రాన రైతులు నమ్మరని, బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాలను రైతులు పట్టించుకోవద్దని ఆయన సూచించారు.






