- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: బండి సంజయ్ భాష అసహ్యంగా ఉంది
రైతు మేళా అని కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేసిందని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు రైతుల మేళా పెట్టాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు మేళా అని కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేసిందని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు రైతుల మేళా పెట్టాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. గురువారం వారు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను బస్సుల్లో తీసుకొచ్చి మేళా నిర్వహించారని ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. 50 శాతం కొనుగోళ్లు చేపట్టలేదని.. బోగస్ ప్రభుత్వం అయ్యిందన్నారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో తీవ్ర పంట నష్టంతో రైతులు చనిపోయారని.. కనీసం అధికారులు వెళ్లి రిపోర్ట్ రాశారా అని ప్రశ్నించారు. కేటీఆర్ రైతుల గురించి మాట్లాడితే కేసు పెట్టారని.. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడారని.. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలని అన్నారు. రైతుల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేసులు పెట్టినా జైలుకు పంపినా వెళ్లేందుకు సిద్ధమేనన్నారు. కేటీఆర్ సభను చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రైతుల ఇండ్లలో పడుకునే పరిస్థితి లేదన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంపై బీజేపీ గూండాలు చేసిన దాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు.
బండి సంజయ్ వాడిన భాష చాలా అసహ్యంగా ఉన్నదన్నారు. అటు కేటీఆర్ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసిందని.. ఏసీ హాల్లో, ఏసీ బస్సుల్లో హోటల్ ఫుడ్ పట్టుకొచ్చి కాంగ్రెస్ రైతు మేళా నిర్వహించినా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. కాంగ్రెస్ పాలిటికల్ డైలీ లేబర్ బ్యాచ్ కేటీఆర్‌ను రెగ్యులర్ తిడితే రోజు వారి ప్యాకేజీ వస్తుందని ఎద్దేవా చేశారు. చిన్న సింహం వస్తేనే కాంగ్రెస్ నేతలు ఇంత భయపడుతున్నారని.. పెద్ద సింహం బయటకొస్తే కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమిటో అని అన్నారు. ‘బిడ్డా.. అద్దంకి దయాకర్ కేటీఆర్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తోలు తీస్తాం..! కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడతావా.. సిగ్గు లేదా నీకు? మీ అమ్మ దగ్గరకు వెళ్లి ఇట్లా మాట్లాడినా అని చెప్పు... నీ దవడ పగలగొడ్తుంది’ అని మాజీ ఎంపీ మాలోత్ కవిత హెచ్చరించారు. సీతక్క ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కాదని.. చేతనైతే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని తరలించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.






