ఐటీ దాడులతో గులాబీ నేతల్లో పరేషాన్ .. ఎన్నికల ముందు సోదాలతో గుబులు

by Disha Web Desk 6 |
ఐటీ దాడులతో గులాబీ నేతల్లో పరేషాన్ .. ఎన్నికల ముందు సోదాలతో గుబులు
X

‘‘ఈడీ, సీబీఐకి భయపడాల్సిన అవసరం లేదు. సీబీఐతో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మీ దగ్గరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈడీ, సీబీఐ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు మనపై పడతాయి. వాళ్లకు అవకాశం ఇచ్చే పనులు చేయవద్దు. అన్నిటికి సిద్ధంగా ఉండాలి. నవంబర్ 3, 2022న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ నేతల్లో గుబులు పట్టుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడు ఎవరి ఆస్తులు, ఇళ్లపై దాడులు చేస్తాయో అర్థంకాని పరిస్థితి అధికార పార్టీ లీడర్లలో నెలకొంది. ఇప్పటివరకు అరడజను మంది నేతలకుపై దాడులు చేయడంతో పరేషాన్ లో పడ్డారు. ఒకవేళ ఆస్తులు బహిర్గతమైతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వస్తుందనే భయం నెలకొంది. వచ్చే ఎన్నికలకు ఫండ్స్ ఇబ్బంది అవుతాయని మరికొందరు నేతలు అలర్ట్ అవుతున్నారు. ఎన్నికలకు ముందు దాడులు జరుగుతాయని అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ హెచ్చరించినది తెలిసిందే.

దశాబ్ది వేడుకల వేళ..

బీఆర్ఎస్ నేతలంతా ఓ వైపు దశాబ్ది వేడుకల్లో బిజీగా ఉంటూ.. మరోవైపు వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇంకోవైపు ఒక్కసారిగా నేతల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ సోదాలు చేపట్టింది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కొండపల్లి మాధవ్ ఆఫీసులపై బుధవారం ఏకకాలంలో దాడులు కొనసాగించింది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడ్డారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతుండగా ఆందోళనలో పడిపోయారు. ఏం చేయాలో అర్థంకాని పరేషాన్ కు లోనయ్యారు. సీఎం, కేటీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో ఐటీ సోదాలు ప్రస్తుతం హాట్ టాపిగ్ మారాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా రియల్ పై దృష్టి పెట్టి ప్రధాన ఆర్థిక వనరుగా ఎంచుకుని ఎన్నికలకు ఫండింగ్ రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఐటీ బీఆర్ఎస్ నేతల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు బుధవారం చేపట్టిన దాడులతోనే స్పష్టమవుతుంది.

రాజకీయ కక్ష సాధింపేనంటూ..

ఐటీ దాడులపై బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఫైర్ అవుతూ ఖండించారు. బీఆర్ఎస్ నేతలపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపితతమేనని ఆరోపిస్తున్నారు. విచార‌ణ సంస్థల‌ను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రతిప‌క్షాల‌పై దుర్మార్గంగా వ్యవ‌హ‌రిస్తుందని మండిప‌డుతున్నారు. ఐటీ దాడులతో కేంద్రం భ‌యపెట్టడం మూర్ఖత్వమేనని, భ‌యపడేదిలేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీది రాజ‌కీయ క‌క్షే.. ఎన్ని దాడులు చేసినా తాము ప్రజ‌ల ప‌క్షమే అన్నారు. దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపు కోసమే కేంద్రంలోని బీజేపీ ఐటీ సోదాలు చేయించిందని ఆరోపించారు. ఒకవైపు పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన మాత్రం జంకుతున్నారు. ఎప్పుడు ఎవరి ఇళ్లపై దాడులు నిర్వహించి ఐటీ అధికారులు చిట్టాను భయటపెడతారోనని ఆందోళన చెందుతున్నారు.

అధినేత ఆరా..

కేసీఆర్ మరోసారి పార్టీ నేతలను అలర్ట్ చేసినట్లు సమాచారం. ఐటీ సోదాలు సమాచారం అందిన వెంటనే పలువురు పార్టీ నేతలతో మాట్లాడినట్లు సమాచారం. ధైర్యంగా ఉండాలని, అన్నీ తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్ది దాడులు ఎక్కువ అవుతాయని, ఎవరూ భయపడొద్దని సూచించినట్లు.. వ్యాపార లావాదేవీలను పక్కాగా చేసుకోవాలని, ఎన్నికల సమయంలో ఇబ్బంది పడకుండా ప్రజల్లో ఉండేలా ప్లాన్ రూపొందించుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులంతా దశాబ్ది ఉత్సవాల్లో బిజీబిజీగా ఉన్న సమయంలోనే ఐటీ అధికారులు ఏకకాలంలో 12 చోట్ల 70 బృందాలతో దాడులు నిర్వహించడంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇంకా ఎవరి లావాదేవీలపై సోదాలు నిర్వహిస్తారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.

ఇప్పటివరకు జరిగిన సోదాలు

=2019 నవంబర్ 20న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఐటీ దాడులు

=2021 జూన్ 11న ఎంపీ నామనాగేశ్వర్ రావు ఆఫీసులపై ఈడీ రెయిడ్స్

=2022 అక్టోబర్ 31న మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

=2022 నవంబర్ 9న మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, ఆఫీసులో ఈడీ, ఐటీ సోదాలు

=2022 నవంబర్ 10న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీసుపై ఈడీ, ఐటీ దాడులు

=2022 నవంబర్ 16న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులపై ఐటీ సోదాలు

=2022 నవంబర్ 22న మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు

=2022 నవంబర్ 24న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ తనిఖీ

=2022 డిసెంబర్ 19న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ

=2023 జనవరి 31న ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

=2023 మార్చి 11న ఎమ్మెల్సీ కవితను 8 గంటలపాటు విచారించిన ఈడీ

=2023 జూన్ 14న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ముషీరాబాద్ బీఆర్ఎస్ నేత కొండపల్లి మాధవ్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు

Also Read: BRS ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ రైడ్స్

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed