BRS: ఒక్కసారైనా మోడీతో రిజర్వేషన్లపై డిస్కస్ చేయలేదు

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్‌రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం వెన్నతో పెట్టిన విద్య అని.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై శాసనమండలిలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు.

BRS: ఒక్కసారైనా మోడీతో రిజర్వేషన్లపై డిస్కస్ చేయలేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం వెన్నతో పెట్టిన విద్య అని.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై శాసనమండలిలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లు ఆమోదం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతానని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. ఢిల్లీకి ఎన్నోసార్లు వెళ్లినా పీఎం మోడీతో బీసీ బిల్లుపై ఒక్కసారైనా చర్చించలేదన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకే వెళ్తున్నారు తప్ప బీసీల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు. పొన్నం ప్రభాకర్ సైతం ఎన్నో మాటలు చెప్పి తప్పారని పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కాకుంటే పొన్నంను కూడా అనుమానించాల్సి వస్తుందన్నారు. పొన్నం ప్రభాకర్‌ను సీఎం బలిపశువు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ది మోసాలు, ద్రోహాల చరిత్ర అని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం అలవాటుగా మారిందని పేర్కొన్నారు. బీసీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే అన్నారు. ఎంపీ వద్దిరాజు రవి చంద్ర మాట్లాడుతూ.. రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తాము సహకరిస్తామన్నా కాంగ్రెస్ ముందుకు రాలేదన్నారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.

Next Story