Madhusudhana Chary: లక్షలాది ఎకరాల్లో ఎండుతున్న పంటలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు ముందు పరిస్థితులను పునరావృతం చేస్తున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

Madhusudhana Chary: లక్షలాది ఎకరాల్లో ఎండుతున్న పంటలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు ముందు పరిస్థితులను పునరావృతం చేస్తున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎస్సారెస్పీ మొదటి దశ కింద ఏడు లక్షల ఎకరాలను ప్రభుత్వం ఎండబెడుతున్నదని.. రెండో దశ ఊసే లేదని ఆరోపించారు. ఎస్సారెస్పీ పేజ్ 1 కింది తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా.. రెండు లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చారని తెలిపారు. లక్షలాది ఎకరాల్లో నాట్లువేసిన తర్వాత నీళ్లు రావని ప్రభుత్వం చెబుతున్నదని.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. ఇది ముమ్మాటికీ రైతాంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న కక్ష అని పేర్కొన్నారు. సాగునీటికే దిక్కు లేని పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీలాపనిందలు వేసి రైతులకు నీరు ఇవ్వకుండా దుర్మార్గానికి ఒడిగడుతున్నదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసి నీటిని ఎత్తిపోసి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరిలో తక్కువ ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని అన్నారు.

ఎస్సారెస్పీ కింద నాట్లు అయిపోయిన తర్వాత నీళ్లు ఇవ్వమని అంటే ఎలా? అని ప్రశ్నించారు. పంటలు వేసిన తర్వాత సాగునీటి వివరాలు చెప్పడం ప్రభుత్వం మతిలేని చర్య అని విమర్శించారు. ఎస్సారెస్పీ కింద ఆరున్నర లక్షల ఎకరాలకు తగ్గకుండా నీరు ఇస్తామని జూలైలో చెప్పి ఇప్పుడు 2.30 లక్షల ఎకరాలకే ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి రైతులను ఎండబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు రైతుల వద్దకు ఓట్ల కోసం ఎలా వస్తారని నిలదీశారు. ఇప్పటికైనా కాళేశ్వరం మోటార్లు నడిపి ఎస్సారెస్పీ మొదటి, రెండు దశల్లో నీరు ఇచ్చి పంటలు కాపాడాలని డిమాండ్ చేశారు. కేవలం కేసీఆర్, హరీశ్‌రావును బద్నాం చేసే ఉద్దేశంతో మోటార్లు ఆన్ చేయడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు ఎలాంటి ఇబ్బంది లేదని.. వాటికి కూడా ఏమైనా అయితే బాగుండని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ అనుకుంటున్నారని ఆరోపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కోర్టు తీర్పు కాదని పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో త్వరలోనే బీఆర్ఎస్ కార్యాచరణ తీసుకుంటుందని చెప్పారు. ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్లను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సందర్శిస్తామని చెప్పారు.

Next Story