BRS: అడ్డంగా దొరకడం సీఎంకు కొత్త కాదు

by Gantepaka Srikanth |

రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తే బొంకులు, హైదరాబాద్‌లో ఉంటే రంకులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు.

BRS: అడ్డంగా దొరకడం సీఎంకు కొత్త కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తే బొంకులు, హైదరాబాద్‌లో ఉంటే రంకులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని.. ఆయన సీఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆయన రాష్ట్ర పరిపాలన చేస్తున్నారా.. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారా అర్థం కావడం లేదన్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బలి ఇవ్వడానికే ఆయన ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు అడ్డంగా దొరకడం కొత్త కాదని పేర్కొన్నారు.

లోపాయికారీ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఇంటినుంచి పరిపాలన చేస్తున్నారని అన్నారు. హిడెన్ ఎజెండాతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని నిరుద్యోగులు ఓట్లు వేశారని.. కానీ అధికారంలోకి రాగానే వారిని మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పిచ్చోడి చేతిలా మారిందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నవీన్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story