మంత్రి అంటే మాకు గౌరవమే.. కానీ రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయి?

by Gantepaka Srikanth |

స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం ఉన్నదని మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.

మంత్రి అంటే మాకు గౌరవమే.. కానీ రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం ఉన్నదని మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి సీతక్క అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉన్నదని.. కానీ, 35,310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని తాము కొన్ని రోజులుగా తెలియజేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ వర్కర్స్‌కు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ, తక్కువ ధరకు మొబైల్ కొనుగోలు చేసి ఇచ్చారని ఆరోపించారు. ఫోన్ల కొనుగోలు టెండర్ రూ.54 కోట్లకు పిలిచారని.. రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. మిగిలిన రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సీతక్క చెప్పుతో కొడతామని అంటున్నారని.. తమకు తమ నాయకుడు కేసీఆర్ సంస్కారం నేర్పించారని అన్నారు. తాము తప్పుడు ఆరోపణలు చేస్తే సీబీఐ విచారణ చేయండని లేఖ రాయొచ్చు కదా అని ప్రశ్నించారు.

సల్మాన్ ఖాన్ పక్కన, మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ దగ్గర ఉండి చూసుకున్న వ్యక్తి ఈ కాంట్రాక్ట్ వేరే వాళ్లకు ఇప్పించాడని తమకు అనుమానం ఉన్నదని పేర్కొన్నారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోషల్ మీడియాలో అంగన్వాడీ వర్కర్స్‌కు 5జీ మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారని.. దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం తన సోషల్ మీడియాలో 5జీ స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారని.. 4జీ ఫోన్లు ఇస్తూ ఇలా తప్పుడు ప్రచారం చేసుకుంటున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీతక్క చెప్పుతో కొడితే పడుతామని.. అదే సమయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టే తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని.. ఈ ప్రభుత్వం విచారణ చేస్తే తమకు నమ్మకం ఉండదని తెలిపారు. సీతక్కకు నిజాయితీ ఉంటే స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు సతీష్‌రెడ్డి, దినేష్‌చౌదరి పాల్గొన్నారు.

Next Story