రైస్ మిల్లర్ల దోపిడీని నిరూపిస్తాం: జీవన్‌రెడ్డి

by Vemula.Srinu Prasad |

వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ దోపిడీ చేశారని.. ఈ దోపిడీని నిరూపిస్తామని.. ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ..

రైస్ మిల్లర్ల దోపిడీని నిరూపిస్తాం: జీవన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ దోపిడీ చేశారని.. ఈ దోపిడీని నిరూపిస్తామని.. ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధర్మకాంట తూకాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ధ్యానం దోపిడీపై విచారణ చేయకుంటే ఇదంతా ప్రభుత్వం కనుసన్నల్లో జరిగిందని భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. ధ్యానం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నదని.. ఆరుగాలం పండించిన రైతు అడ్డీకి పావుచేరులా ధ్యానం అమ్ముకున్నారని ఆరోపించారు. క్వింటాల్‌కు రూ.120 నుంచి రూ.243 వరకు దోపిడీకి గురయ్యారని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగులో ముందుకు పోలేకపోతున్నారని తెలిపారు. మరోవైపు.. ప్రభుత్వం ఏడు రకాలను మాత్రమే సాగు చేయాలని ప్రకటనలు ఇస్తున్నదని.. దిగుబడి లేని పంటలను సాగు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు.

ఏడు రకాల పంటలకు చీడ పురుగుల సమస్య తలెత్తుందని చెప్పారు. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రబీ సీజన్ బోనస్‌ను ఈ ప్రభుత్వం మర్చిపోయిందని.. రైతులను ఇక్కట్లకు గురిచేసేలా ఈ ప్రభుత్వం తీరు ఉన్నదని అన్నారు. కేసీఆర్ రైతుబంధు రూ.10 వేలు ఇస్తే, కాంగ్రెస్ రూ.15 వేలు ఇస్తామని మోసం చేసిందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లోనైనా రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ తనకే అర్థం కావడం లేదని.. సాధారణ రైతుకు ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. మోడీ బడే బాయ్ అని చెప్పే రేవంత్‌రెడ్డి.. ధ్యానం కొనుగోలుపై ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు. అటు రైతు బీమా ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story