BRS: అందరం వెళ్లి ప్రధాని ఇంటి ముందు కూర్చుందాం.. రిజర్వేషన్లు సాధించాకే తిరిగి హైదరాబాద్‌కు వద్దాం

by Gantepaka Srikanth |

బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ ఇంటి ముందు కూర్చుందాం అని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

BRS: అందరం వెళ్లి ప్రధాని ఇంటి ముందు కూర్చుందాం.. రిజర్వేషన్లు సాధించాకే తిరిగి హైదరాబాద్‌కు వద్దాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ ఇంటి ముందు కూర్చుందాం అని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే తామూ వెంట వస్తామని వెల్లడించారు. ప్రధానిని కలవడమే దీనికి పరిష్కారమని.. 42 శాతంపై వెనక్కి పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 42 శాతం అమల్లోకి వచ్చాకనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని.. ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్ఎస్ విధానాన్ని స్పష్టంగా చెప్పామని అన్నారు. జీవో ద్వారా సాధ్యం కాదని.. రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని చెప్పామని.. అయినా పట్టించుకోలేదని అన్నారు. బీసీలను అవమానం చేసేలా వ్యవహరించారని.. జీవో న్యాయస్థానంలో నిలబడదని సీఎం, మంత్రులు, అందరికీ తెలుసని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న రేవంత్‌రెడ్డి జీఓ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. బీసీలు ఏం చేస్తారులే అని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

1992లో తమిళనాడు సీఎం జయలలిత ఎమ్మెల్యేలు, సిబ్బందిని దిల్లీ తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం భీష్మించి కూర్చున్నారని.. అప్పుడు కేంద్రం దిగివచ్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్ల తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు పెరిగాయని వెల్లడించారు. అందరం కలిసి ఢిల్లీ వెళ్దామని.. తామందరం వస్తామని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల అంశం తేలే వరకు హైదరాబాద్ రావద్దని అన్నారు. ఒక్క శాతం రిజర్వేషన్ వెనక్కిపోయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు స్టంట్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతిని కలవకుండానే ఢిల్లీలో ధర్నా చేసి హంగామా చేశారని అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని వెల్లడించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్ అనేలా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. ఆ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నదని.. అమలు కాదని తెలిసి కూడా మోసపూరిత జీవో తీసుకొచ్చి ఆగం చేశారని అన్నారు. బీసీల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్ కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.

Next Story