కుంభకోణాల్లో వచ్చిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేశారు: దేవీప్రసాద్

by Gantepaka Srikanth |

పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడిందని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఆరోపించారు.

కుంభకోణాల్లో వచ్చిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేశారు: దేవీప్రసాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడిందని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వంపై ఓటర్లలో అసంతృప్తి కనిపించిందని.. పోలింగ్ సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని అర్థమవుతున్నదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకున్నట్టు ఫలితాలు రాకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు గెలవాలని రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి వివిధ కుంభకోణాల్లో అక్రమంగా సంపాదించిన డబ్బును ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. అయినా.. ఓటర్లు కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలింగ్ బూత్‌ల్లోకి ప్రవేశించి ఓటర్లను ప్రభావితం చేశారని.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోలీసులపై వాడిన అసభ్య భాషను సరైంది కాదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తొడ పాశం పెట్టారని.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి చెంప దెబ్బ తప్పదని హెచ్చరించారు.

Next Story