BRS: ఆ డబ్బుతో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించొచ్చు

by Gantepaka Srikanth |

సీఎం, మంత్రుల జల్సాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మాత్రం చెల్లించడం లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు.

BRS: ఆ డబ్బుతో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించొచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం, మంత్రుల జల్సాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మాత్రం చెల్లించడం లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వంద కిలోమీటర్ల దూరానికి సైతం మంత్రులు హెలికాప్టర్‌ను వాడుతున్నారని.. సీఎం ఢిల్లీ టూర్ల ఖర్చు రూ.300 కోట్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తీర్చొచ్చని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తారా? లేదా పథకాన్నే రద్దు చేస్తారా? తేల్చాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని.. యూనివర్సిటీలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో డిగ్రీ కళాశాలలు పరీక్షలు వాయిదా వేస్తున్నాయని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఏకంగా సర్క్యులర్ ఇచ్చిందని, మిగతా యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. గుడి లేని పూజారిలా.. పంతులు లేని గుడిలా.. వైద్యుడు లేని ఆస్పత్రిలా విద్యాశాఖ పరిస్థితి తయారైందన్నారు. అకడమిక్ క్యాలెండర్‌ను అమలు చేయలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తే జాతీయ స్థాయి పీజీ ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థుల పరిస్థితి ఏంటని నిలదీశారు. త్వరలో కాలేజీలు మూసివేసే పరిస్థితి వస్తుందన్నారు. గతంలో సెటిల్‌మెంట్లు చేసి అలవాటైన రేవంత్‌రెడ్డి సీఎం స్థానంలో ఉండి కూడా ఇప్పుడు వన్ టైం సెటిల్‌మెంట్ అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ సమ్మక్క సారక్క జాతరను తలపింపజేయడం ఖాయమన్నారు. సభా ఏర్పాట్లు చూసి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

Next Story