- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Balka Suman: సెక్షన్ 109 అంటే హత్యాయత్నం కేసు కాదా?
బీఎన్ఎస్ 109 సెక్షన్ అంటే హత్యాయత్నం కింద కేసు నమోదు అన్నట్టే అని.. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎన్ఎస్ 109 సెక్షన్ అంటే హత్యాయత్నం కింద కేసు నమోదు అన్నట్టే అని.. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్యపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారని చెప్పారని.. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ జూబ్లీహిల్స్ ఎస్‌హెచ్ఓ ఓ ప్రకటన విడుదల చేశారని తెలిపారు. శ్వేతకు ఇచ్చిన నోటీసుల్లో బీఎన్ఎస్ 109 సెక్షన్ పేర్కొన్నారని అన్నారు. పోలీసుల తీరును ప్రజలు గమనించాలని కోరారు. కేటీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు రేవంత్‌కు ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన అని చెప్పి దుర్మార్గపు పాలన నడుపుతున్నారని అన్నారు.
ఇందిరమ్మ పాలన అని చెప్పి ఎమర్జెన్సీ పాలన అమలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ హోంమంత్రిగా ఉండి బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారని.. అక్రమ కేసులకైతే అంతే లేదని అన్నారు. పోలీసులు పద్ధతి మార్చుకోవాలని.. ప్రజాగ్రహం వస్తే ఏం చేయలేరని హెచ్చరించారు. తాము జైలు భరో పిలుపునిస్తే పోలీస్ స్టేషన్లు, జైళ్లు సరిపోతాయా? అని ప్రశ్నించారు. తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. చట్టం అందరికీ ఒకేలా అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో చిరుమళ్ల రాకేశ్‌కుమార్, పల్లె రవికుమార్, తుంగబాలు, లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.






