అబద్ధాల రాజకీయాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్​.. మంత్రి ఉత్తమ్

by Kema Shiva Kumar |

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల మరణాలపై కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు.

అబద్ధాల రాజకీయాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్​.. మంత్రి ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో 10 మంది రైతులు మృత్యువాత పడ్డారంటూ బీఆర్​ఎస్​ నేత కేటీఆర్ చేసిన మాటల్లో నిజం లేదని, రాజకీయాల కోసం బురద చల్లే ప్రయత్నం తప్ప మరోటి కాదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు చనిపోలేదని, అబద్ధాల ప్రచారానికి బీఆర్ఎస్​ పార్టీ పెట్టింది పేరు అని దుయ్యబట్టారు. గురువారం కేటీఆర్​ విడుదల చేసిన లేఖపై ఆయన ఘాటుగా స్పందించారు.

గత పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగాన్ని కుంభకోణాల కూపంగా మార్చిన బీఆర్ఎస్ నాయకులు రైతు సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ చరిత్రలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం సేకరణకు 8,575 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు 54.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా, ప్రభుత్వం అందులో 46.21 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ రూ. 7,841 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ ద్వారా 6.3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని, 18.3 కోట్ల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించేందుకు వీలుగా 13 వేల వాహనాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. గణాంకాలు వాస్తవాలను ప్రస్ఫుటంగా వెల్లడిస్తుంటే, రైతులను తప్పుదోవ పట్టించేందుకే కేటీఆర్​ లేఖ రూపంలో అవాస్తవాలు రాశారని మండిపడ్డారు. పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతుంటే దానిని వక్రీకరించి అసత్యపు ప్రచారానికి పూనుకోవడం వారి డొల్లతనానికి అద్దం పడుతోందన్నారు.

వాస్తవానికి వారి పాలనలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు, మిల్లర్లతో లాలూచీలు, చెల్లింపులలో తీవ్ర ఆలస్యం జరిగాయని దుయ్యబట్టారు. వాస్తవాలు ఇలా ఉంటే 'గురివింజ తన నలుపు ఎరుగదన్నట్లు' ఆయన రైతు సంక్షేమం గురించి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో సరికొత్త రికార్డు నమోదు చేసుకోవడంతో పాటు ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుంటే ఓర్వలేక లేఖ రూపంలో రైతులపై మరోసారి అక్కసు వెళ్లగక్కారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం (ATM) మాదిరిగా వాడుకుని వేల కోట్లు దోచుకున్న అంశం దేశవ్యాప్తంగా అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రతి ప్రాజెక్టుపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

Next Story