- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దీక్షా దివాస్’కు సన్నాహాలు.. ఎన్నికల వేళ రావడంతో BRS భారీ స్కెచ్..!
దీక్షా దివాస్‌కు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహాలు చేస్తుంది. ప్రతి గ్రామంలో నిర్వహించేలా శ్రేణులకు ప్రణాళికలు ఇచ్చింది. సేవా కార్యక్రమాలతో పాటు ఉద్యమ ఘట్టాన్ని

దిశ, తెలంగాణ బ్యూరో: దీక్షా దివాస్‌కు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహాలు చేస్తుంది. ప్రతి గ్రామంలో నిర్వహించేలా శ్రేణులకు ప్రణాళికలు ఇచ్చింది. సేవా కార్యక్రమాలతో పాటు ఉద్యమ ఘట్టాన్ని వివరించి ప్రజలను చైతన్యపర్చాలని, ఎన్నికల ముందు రోజు కావడంతో ఓటర్లలో సెంటీమెంట్ తీసుకురావాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ప్రతిఇంటిపై గులాబీ జెండా ఎగురవేయాలని శ్రేణులకు పిలుపు నిచ్చింది. గులాబీ పార్టీ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన నిరహారదీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షను మరింత రగిల్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానికి కారణమైన విషయం తెలిసిందే.
అప్పటినుంచి ప్రతీ ఏటా నవంబర్ 29న దీక్ష దివాస్‌గా నిర్వహిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు రావడంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీగ్రామంలో ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. రక్తదాన శిబిరాలు, పండ్లు పంపిణీ, ఉద్యమకారులకు సన్మానం, అమవీరుల స్తూపం వద్ద నివాళులు, సేవా కార్యక్రమాలు, ఉద్యమకారుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నగరాల్లో ప్రతి డివిజన్‌లో, మున్సిపాలిటీల్లో ప్రతికాలనీలో గులాబీ జెండా ఎగురవేసి దీక్షాదివాస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆదేశించారు. ఈ కార్యక్రమంతో ప్రజల్లో తిరిగి ఉద్యమ చరిత్రను వివరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం షురూ చేస్తున్నారు.
ఎన్నికలప్పుడే గుర్తుకొస్తున్నామా..?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 1200లకు మందిపైగా చనిపోయారని బీఆర్ఎస్ పేర్కొంది. కానీ అందులో సగం మంది కుటుంబాలనే ప్రభుత్వం ఆదుకుందని ఉద్యమకారుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఉద్యమ సమయంలో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. కొంతమందికే లబ్దిచేకూర్చి మిగతావారిని విస్మరించడంతో మండిపడుతున్నారు. మళ్లీ ఇప్పుడు దీక్షాదివాస్ నిర్వహిస్తున్న సందర్భంలో ఉద్యమకారులతో పాటు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సన్మాన కార్యక్రమం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఎన్నికలప్పుడే ఉద్యమకారుల కుటుంబాలు గుర్తుకువస్తాయా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అమరుల కుటుంబాలకు ఇచ్చినమాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.






