కీలక సమావేశానికి BRS హైదరాబాద్ అధ్యక్షుడు డుమ్మా!

by GSrikanth |

తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన హైదరాబాద్ జిల్లా సమావేశానికి మరోసారి పార్టీ జిల్లా అధ్యక్షుడు గైర్హాజరయ్యారు.

కీలక సమావేశానికి BRS హైదరాబాద్ అధ్యక్షుడు డుమ్మా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన హైదరాబాద్ జిల్లా సమావేశానికి మరోసారి పార్టీ జిల్లా అధ్యక్షుడు గైర్హాజరయ్యారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే పద్మారావు సైతం రాలేదు. దీంతో నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. ఈ నెల 25న హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ ఆదేశం మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఇద్దరు హాజరుకాలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా హాజరు కాలేదని పార్టీలోని నేతలే అభిప్రాయపడుతున్నారు.

వారివురి గైర్హాజరు మరోసారి చర్చనీయాంశమైంది. సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని మిగిలిన డివిజన్లలో కూడా ఈ నెల 24 లోగా సమ్మేళనాలు నిర్వహించుకోవాలని సూచించారు. 25న నిర్వహించే నియోజకవర్గ సమ్మేళనాలకు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను ఆహ్వానించాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించాలన్నారు. నియోజకవర్గ ప్రగతి నివేదికను రూపొందించి ఆత్మీయ సమ్మేళనంలో వివరించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు స్టీఫెన్ సన్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేష్, రావుల శ్రీధర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నియోజకవర్గ ఇంచార్జిలు ఆనంద్ గౌడ్, నందు బిలాల్, ఆజాం, సలా ఉద్దిన్ లోది, రాంరెడ్డి, జీవన్ సింగ్, బక్రీ తదితరులు పాల్గొన్నారు.

Next Story