BRS: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు సంచలన లేఖ

by Ramesh Goud |

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని.. సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.

BRS: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు సంచలన లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని.. సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ రాశారు. తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో జరుగుతున్న జాప్యం, రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై వివరించారు. వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు టీఎంసీ నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు ఇంకా లభించలేదని.. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండడం శోచనీయమని పేర్కొన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తున్నదని తెలిపారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసీ జారీపై కేంద్రం జోక్యం అవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అనుమతుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే చర్యలు చేపట్టడంలో కేంద్రం పూర్తిస్థాయి సహకారం అందించాలని కోరారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నాబేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని.. దీనివల్ల రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం గోదావరి-కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఉన్నా, ఏపీ ప్రభుత్వం ఏవీ లేకుండానే నిర్మిస్తుండడం చట్ట ఉల్లంఘన అవుతుందని తెలిపారు. చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రెండు లేఖలు రాయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంకెన్ని సార్లు మాట తప్పుతారు..?

‘మాట తప్పడం.. మడమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన.. పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మార్చుతారు. ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు’ అని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ అన్నారని.. ఆ తరువాత దసరా వరకు పూర్తిచేస్తామని చెప్పారని.. నేటికీ 20 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ అందలేదని తెలిపారు. అలాగే.. రైతుబంధు ఇప్పుడు తీసుకుంటే రూ.10వేలు అని.. తాము వచ్చాక రూ.15వేలు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. వానకాలం రైతు భరోసా ఎగవేశారని, యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారని.. ఇప్పుడు మాట మార్చి 31 వరకు అంటున్నరని తెలిపారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టి రేవంత్ రైతులకు భరోసా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆసరా రూ.4 వేలు, తులం బంగారం, మహిళలకు 2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి.. ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలి అని పేర్కొన్నారు.

Next Story