- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై BRS ఫోకస్.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్త యాత్రలకు సన్నద్ధం
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలో రావాలనే లక్ష్యంగా వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ బస్సుయాత్ర, కేటీఆర్ పాదయాత్రను చేపట్టబోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతున్నది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నది. మరోసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నది. అందులోభాగంగానే మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ బస్సుయాత్ర, కేటీఆర్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి సారించింది. ఓ వైపు సభ్యత్వ నమోదు, కేడర్ శిక్షణ, గ్రామస్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి కార్యక్రమాలను చేపడుతున్నది. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యమ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేస్తున్నది.
కాంగ్రెస్ వైఫల్యాలే లక్ష్యంగా..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలో ఇప్పటివరకు పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చాలావరకు అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తున్నది. అయితే.. వాటినే లక్ష్యంగా చేసుకొని బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ ప్రభుత్వంలో బయటపడిన అవినీతి, అక్రమాలను సైతం ప్రధాన అస్త్రాలుగా మలుచుకోవాలని పార్టీ నిర్ణయించింది. మరోవైపు.. క్షేత్రస్థాయిలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన కార్మికుల మద్దతు సైతం కూడగట్టేలా పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీ సభ్యత్వ నమోదులో, త్వరలో ప్రకటించే కార్యవర్గాల్లోనూ యూత్‌కు పెద్దపీట వేయాలని పార్టీ భావిస్తున్నది. యూత్ తలచుకుంటే ఏదైనా సాధ్యమనే అభిప్రాయానికి వచ్చిన బీఆర్ఎస్.. పార్టీలో తదుపరి టికెట్ల కేటాయింపులోనూ వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే.. వచ్చే ఏడాదే కేసీఆర్ బస్సుయాత్రతోపాటే కేటీఆర్ పాదయాత్ర వంటి భారీ ప్రజా కార్యక్రమాలతో దూకుడు పెంచేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.
విద్యార్థి, యువజన నేతలతో భేటీ..
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇప్పటికే వరంగల్‌లో రైతు సదస్సు నిర్వహించింది. త్వరలోనే తెలంగాణ భవన్‌లో యువజన, విద్యార్థి నేతలతో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పార్టీ ముఖ్య నేతలు రేవంత్ ప్రభుత్వంపై రోజుకో ఆరోపణ, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికే అసెంబ్లీతోపాటు ప్రజా వేదికలు, సామాజిక మాధ్యమాలు, జిల్లాస్థాయిలో కార్యక్రమాల ద్వారా ఈ అంశాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మరోవైపు.. గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అటు ‘సర్’ పైనా కేటీఆర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బస్సుయాత్రకు సన్నాహాలు..?
తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ప్రజల మధ్య విస్తృతంగా పర్యటించిన కేసీఆర్.. మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, వివిధ వర్గాల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ యాత్ర చేపట్టేందుకు సంసిద్ధం అవుతున్నారు. ప్రతి జిల్లాలో ముఖ్య సమావేశాలు, ప్రజాప్రతినిధులతో భేటీలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించేలా యాత్రను రూపొందించే అవకాశం ఉన్నదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ బలహీనపడిన ప్రాంతాల్లో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం నింపడమే యాత్ర ప్రధాన ఉద్దేశంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టే అవకాశాలపైనా చర్చ నడుస్తున్నది. యువత, నిరుద్యోగులు, రైతులు, పట్టణ మధ్యతరగతి వర్గాలతో నేరుగా మమేకం కావడానికి పాదయాత్ర ఉత్తమ మార్గమనే అభిప్రాయం పార్టీ నాయకత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇందుకోసం పార్టీ ఒకవైపు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టగా, మరోవైపు ప్రజా ఉద్యమాలు, రాష్ట్రవ్యాప్త యాత్రల ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవాలని భావిస్తున్నది.






