- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ వద్ద రెండు బలమైన అస్త్రాలు.. కార్యాచరణ సిద్ధం!
హైదరాబాద్, సైబారాబాద్, మేడ్చల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మూసీ, హైడ్రా అంశాలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని విస్తృత ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్, సైబారాబాద్, మేడ్చల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మూసీ, హైడ్రా అంశాలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని విస్తృత ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశాల ద్వారా ఇప్పటివరకు నిరాశ్రయులైన, నష్టపోయిన బాధితుల ఆవేదనను తమకు అనుకూలంగా మలచుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. సైబరాబాద్, మేడ్చల్ పరిధిలో హైడ్రా బాధితులు, హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో మూసీ ప్రాజెక్టు బాధితులు ఎక్కువగా ఉన్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచి గతంలో వారి ఇళ్లను కూల్చివేసినప్పటి వీడియోలను ప్రచారం చేయాలని నిర్ణయించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 10 వేలమంది నిరాశ్రయులు అవుతారని ప్రభుత్వమే చెప్పినందున వారందరినీ కలిసి కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా, మూసీలను ఆమోదించినట్లుగా అవుతుందని వివరించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్ధమవుతున్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించారు.
నేరుగా బాధితుల చెంతకు..
మొదటి దశలో మూసీ బాధితులు ఎక్కువగా అపార్ట్‌మెంట్లలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు గుర్తించారు. బాపూఘాట్ వరకు పెద్దఎత్తున నివాసాలు ఉన్నాయని, వారందరినీ ఒకే వేదిక మీదికి తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు. వారిలోని భయబ్రాంతులు, ఆందోళనలు, బ్యాంకు రుణాలు, ఉద్యోగ అభద్రత తదితర అంశాలను మిగితాచోట్ల ప్రచారం చేయబోతున్నారు. కాలనీ, మురికి వాడల వాసులతో సమావేశాలు నిర్వహించి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని, అదే సమయంలో బాధితులకు అండగా ఉంటున్నామనే విషయాన్ని చెప్పాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన పీపీటీనే ఆస్త్రంగా చేసుకోవాలని, వారు చెప్పిన, చెప్పని అంశాలపై ప్రజల్లో అపోహలు, అనుమానాలు, భయాందోళలను వారికి మరింత తీసుకువెళ్లే విధంగా చేయనున్నారు. ఇప్పటినుంచే బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి తమవైపు తిప్పుకుని ఎన్నికల్లో అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా వ్యూహరచన చేస్తున్నారు.
ప్రభుత్వం దిగివచ్చేలా..
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలను ఎత్తివేస్తున్నారనే ప్రచారాన్ని బీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేసిందని, చివరికి జిల్లాల కుదింపు అంశంపై సీఎం రేవంత్ స్వయంగా వివరణ ఇచ్చి జిల్లాల రద్దు ఉండదని ప్రకటించాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. జిల్లాల కుదింపుపై వెనక్కి తగ్గినట్లే మూసీపై కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాడాలని గులాబీ నేతలు నిర్ణయించారు. మూసీ మీద ప్రభుత్వం రాజీకి వస్తుందని, బాధితులు లేకుండా పనులు చేసుకునేవిధంగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. దీంతోపాటుగా మూసీ బాధితులకు అండగా ఉండటానికి ఇప్పటికే పెద్దఎత్తున బాధితుల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ న్యాయస్థానాల్లో పిటిషన్లు చేసింది. వారి తరఫున పార్టీ లీగల్ సెల్‌ద్వారా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఇచ్చిన అధికారిక అంశాల ఆధారంగా న్యాయపరంగా ముందుకు వెళ్లాలని కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.






