సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణ.. సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

by Bhanu |

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌కు చెందిన దళిత ఎమ్మెల్యే వేముల వీరేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు.

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణ.. సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
X

దిశ, హనుమకొండ : ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌కు చెందిన దళిత ఎమ్మెల్యే వేముల వీరేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ వేముల వీరేశాన్ని ఉద్దేశించి అసభ్యంగా, దౌర్జన్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కమలాపూర్ మండల మాజీ జెడ్పిటిసి మారేపల్లి నవీన్ కుమార్, సీనియర్ నాయకులు పోడేటి రామస్వామి, సరికొమ్ముల వెంకటేష్, మొలుగు దిలీప్, ములుగు పూర్ణచందర్, తొగరు భిక్షపతి, మాట్ల రాజకుమార్ తదితరులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు.


ఫిర్యాదులో వారు, సీఎం వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, బెదిరింపులకు తావిచ్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. వేముల వీరేశాన్ని ఉద్దేశించి "బట్టలూడదీసి నడిబజార్లో కొడతా", "క్లాక్ టవర్ వద్ద బట్టలు విప్పి పగలగొడతా" అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ముఖ్యమంత్రి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హనుమకొండలో సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లోనూ దీనిపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Next Story