Harish Rao: ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం: హరీశ్ రావు

by Prasad Jukanti |

ట్రిబుల్ ఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

Harish Rao: ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడం అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు ఆర్ఆర్ఆర్ బాధితులకు (RRR victims) బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు కలిశారు. ట్రిబుల్ ఆర్ విషయంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని బాధితులు హరీశ్ రావు దృష్టికి తీసుకువచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని, ఇచ్చిన మాట తప్పి నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు చేస్తూ భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ చట్టం అమలు చేయకుండా తక్కువ ధరకే భూములు లాక్కునే కుట్ర చేస్తున్నారని వివరించారు. తమ సమస్య పట్ల ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని కోరారు. బాధితులకు ధైర్యం చెప్పిన హరీశ్ రావు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తర దిక్కు ఆర్ఆర్ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలను హరీశ్ రావు డిమాండ్ చేశారు.

మాట మార్చడం దౌర్భాగ్యం:

భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం అని హరీశ్ రావు మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలో మీటర్లను పరిగణనలోకి తీసుకోవడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మధ్య నుండి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నదని బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. చౌటుప్పల్ వద్ద జంక్షన్ రింగ్ గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184 కు పెంచడం వల్ల పేదల భూములు, ప్లాట్లు కోల్పోతున్నారు. దీనికి గాను నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీగా ఉన్న సమయంలో కోమటి రెడ్డి బాధితులతో కలిసి ఆర్ఆర్ఆర్ మార్చాలని, రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ అలైన్మెంట్ మార్చుతామని హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పుడేమో అదే పోలీసు బలగాలతో, నిర్బంధంగా రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంత పెట్టడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కాదని సర్వేలు నిర్వహించడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటు అన్నారు.

బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదు:

కాంగ్రెస్ (Congress) పాలనలో అన్ని మాట మార్చడమే కొనసాగుతున్నదని హరీశ్ రావు విమర్శించారు. నాడు ఫార్మా సిటీ (PharmaCity) అని నేడు మాట మార్చి పచ్చని పొలాల్లో చిచ్చుపెడుతున్నారు. నాడు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ (RRR alignment) మార్పు అని నేడు మాట మార్చి నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి హామీ అమలు చేయాలని లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దక్షిణ దిక్కున 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకున్నట్లుగానే, ఉత్తర భాగాన పరిగణలోకి తీసుకోవాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదా భూములు కోల్పోతున్న రైతులకు సంతృప్తికర పరిహారం అందించి, వారి పూర్తి అంగీకారంతో భూసేకరణ జరపాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాకుంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల గొంతును వినిపిస్తామన్నారు.

Next Story