కత్తి చంద్రబాబుది.. పొడిచేది రేవంత్ రెడ్డి : జలద్రోహంపై హరీష్ రావు ఫైర్

by Naga Rani Yarlagadda |

రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు. శుక్రవారం తెలంగాణ భవన్లో అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించిందన్నారు.

కత్తి చంద్రబాబుది.. పొడిచేది రేవంత్ రెడ్డి : జలద్రోహంపై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు. శుక్రవారం తెలంగాణ భవన్లో అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించిందన్నారు. దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రానికి జరుగుతున్న జలద్రోహాన్ని వివరించేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంవాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని కాళోజీ గారు ముందే ఊహించి చెప్పినట్లే.. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర నీటిని ఆంధ్రాకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. పక్కా పథకం ప్రకారమే పోలవరం - నల్లమలసాగర్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని, ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో చెల్లని రిట్ పిటిషన్ వేసి వాపస్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక వేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని హరీష్ రావు పేర్కొన్నారు.

చారిత్రక ద్రోహం.. రాష్ట్రానికి మరణశాసనం

గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో BRS మొదటి నుండి అప్రమత్తం చేస్తూనే వస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పెడచెవిన పెట్టిందన్నారు. గతంలో అనేక సార్లు ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టి.. వాస్తవాలు బయట పెడితే నామమాత్రంగా బ్యాక్ డేట్ వేసి.. మీడియాకు లెటర్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నా.. కాంగ్రెస్ తప్పులు చేస్తూనే ఉందని హరీష్ రావు ఆరోపణలు చేశారు. బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే కానీ, ఏపీ జల దోపిడి ఆగలేదన్నారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే, పొడిచేది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదన్నారు. ఈరోజు డిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర మరణ శాసనం రాయబోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తోందని ఆ కుట్రల తీరు గమనిస్తే అందరికీ అర్థమవుతుందని తెలిపారు. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు డిల్లీ మీటింగ్ కు వెళ్లడమే కాకుండా.. తమ ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపి.. పెట్టనంటూనే దానిపై సంతకం పెట్టి తెలంగాణ నదీజలాల హక్కుల్ని కాలరాశాడని, వేయను అంటూనే కమిటి వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడని, టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టు కు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడని తీవ్ర విమర్శలు చేశారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటిస్తే.. దానిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాపస్ తెచ్చుకున్నాడన్నారు.

నల్లమలసాగర్ పై పక్కా ప్లాన్ తో సహకరిస్తూ.. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని హరీష్ రావు ఆరోపించారు. ఏపీ ఒత్తిడితో నేడు పేరుకు జలవివాదాల మీటింగ్ జరుగుతున్నా.. మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్రే జరుగుతోందన్నారు. గతంలో కేంద్ర జల్ శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలోనూ ఏపీ ఈ ప్రాజెక్టుపైనే ఏకైక ఎజెండా ముందు పెట్టిందన్నారు. ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్‌ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నారన్నారు. దీనిపై గతేడాది డిసెంబర్ 30న తాను లేఖ రాస్తే.. కాంగ్రెస్ సర్కార్ మర్నాడు మరో లేఖ రాసిందన్నారు. అందులో మొదటి కండీషన్.. నల్లమల సాగర్ కు డిపిఆర్ వెంటనే ఆపాలి, కేంద్రం అనుమతుల ప్రక్రియను తక్షణం ఆపాలి అని.. రెండోది.. ప్రీ ఫీజబులిటి రిపోర్టు ఆపినట్లు ఏపీ హామి ఇవ్వాలని రాసారు. ఈ రెండు కండీషన్లకు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగ్ కు వస్తామన్నారు. ఈ రెండు కండీషన్లకు కేంద్రం హామి ఇచ్చిందా? ఏపీ హామి ఇచ్చిందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ అప్రూవల్ తోనే లెటర్ వెళ్లినపుడు ఎలాంటి హామీ లేకుండా మీటింగ్ కు ఎందుకు వెళ్లారని మీడియా ముఖంగా నిలదీశారు.

దుర్మార్గాన్ని ఎండగడుతాం.. మరో పోరాటం చేస్తాం

పైగా దీనికి వెళ్లేందుకు ఆదిత్యనాథ్ తప్ప ఏ ఇంజినీర్ దొరకలేదా ? అని ప్రశ్నించారు. ఆదిత్యనాథ్ తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించారని మీకు తెలియదా? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. గురుదక్షిణ కోసం రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. ప్రజాక్షేత్రంలో దుర్మార్గాన్ని ఎండగట్టి.. రాష్ట్ర నీటిహక్కుల కోసం మరోపోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిపై కేంద్రమంత్రులైన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు విప్పాలన్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ, దావోస్ కు తిరగడమే తప్ప రాష్ట్ర పాలనపై దృష్టి లేదని విమర్శించారు.

Next Story