- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు నాయుడికి ఉన్న చిత్తశుద్ధి నీకు లేదు : సీఎం రేవంత్‌పై హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని హరీష్ రావు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీమంత్రి హరీష్ రావు (Harish Rao) సోమవారం ఎర్రగడ్డలో పర్యటించారు. అక్కడ ఆటోడ్రైవర్లతో మాట్లాడిన ఆయన.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ (Telangana Bhavan) వరకూ ఆయన ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కుటుంబాలన్నీ ఇప్పుడు రోడ్డుమీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆటో కార్మికుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఆటో కార్మికులంతా ధైర్యంగా, ఓర్పుగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. తెలంగాణ భవన్ వరకూ రమేష్ గౌడ్ అనే వ్యక్తి ఆటోలో వచ్చానని, ఆటో తోలుతూ తన కొడుకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నానని, ఇంటి అద్దె, ఖర్చులు, ఆటో ఫైనాన్స్ అన్ని ఖర్చులు ఎక్కువైపోతున్నాయని అతను వాపోయాడన్నారు. రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు వేస్తున్న ప్రభుత్వానికి.. ఆటోడ్రైవర్లకు ఇచ్చేందుకు డబ్బులు లేవని అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు.
ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. వారిని మోసం చేసిందని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు పంపుతున్న రేవంత్ సర్కార్ ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు మాత్రం ముందుకు రావడంలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారుకు వాటాల మీద ఉన్న శ్రద్ధ ఆటోడ్రైవర్లపై లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామనిచెప్పి రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట తప్పారని, ఆటో కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500 కోట్లు బాకీ పడిందన్నారు. పక్కరాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారంలోకి వచ్చిన ఏడాదికే ఆటోడ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చారని, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా ఇంకా హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం పట్ల చంద్రబాబు నాయుడికి ఉన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ఆటోడ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, వారికి ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే రేవంత్ రెడ్డికి సోయొస్తదని, అప్పుడైనా ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని అన్నారు.






