CM రేవంత్‌‌పై దేశద్రోహం కేసు పెట్టాలి: BRS

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్‌ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

CM రేవంత్‌‌పై దేశద్రోహం కేసు పెట్టాలి: BRS
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆఖరికి తన భూ దాహానికి విశ్వవిద్యాలయాలు కూడా బలికాక తప్పడం లేదని పేర్కొన్నారు. గుడి, బడి జోలికి వెళ్లినోళ్లు బాగుపడినట్టు చరిత్రలో లేదని తెలిపారు. నెమళ్ల హింస విషయంలో, సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి యూనివర్సిటీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, జాతీయ పక్షి పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా రేవంత్‌రెడ్డిని తక్షణమే సీఎంగా తొలగించాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సర్వేలు చేసి, కన్నేసి పెట్టిన భూములను ఇప్పుడు సీఎం కాగానే కాజేస్తున్నారని ఆరోపించారు.

హెచ్‌సీ‌యూలో గతంలో ఫుట్‌బాల్ ఆడిన ఆయన ఇప్పుడు అదే భూములను ఖతం పట్టిస్తున్నారని పేర్కొన్నారు. తన భూ దాహం వల్ల ఉన్న ఊరులో ఛీ కొట్టించుకున్నా సిగ్గు రాకపోతే ఇంకేం లాభమని తెలిపారు. ఇప్పుడు పిల్లలు చదువుకునే యూనివర్సిటీ భూముల మీద పడ్డారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను ఉద్ధరిస్తా అని ఉద్దెర ముచ్చట్లు చెప్పి, రేపు రేపు అన్ని విద్యాలయాలను అమ్మేసే కుట్రకు తెర లేపారని ఆరోపించారు. అందులో భాగంగానే ఓయూలో రోజుకో దొంగ సర్క్యులర్ జారీ చేస్తూ, ప్రశ్నించే వాళ్లకు స్థానం లేకుండా చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.. ఎమర్జెన్సీ పాలన తేవడమే లక్ష్యమా అని నిలదీశారు.

Next Story