BRS రెండు నాల్కల ధోరణి.. కన్‌ఫ్యూజన్‌లో గులాబీ రాష్ట్ర నాయకులు!

by Disha Web Desk 2 |
BRS రెండు నాల్కల ధోరణి.. కన్‌ఫ్యూజన్‌లో గులాబీ రాష్ట్ర నాయకులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. ఉభయ సభల ఎంపీలు ద్రౌపది ముర్ము ప్రసంగానికి దూరంగా ఉన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నదని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నదని.. ఇలా పలు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదనే అంశాన్ని కూడా అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగులోనూ ఎంపీలకు ఇదే దిశానిర్దేశం చేశారు. ఒకవైపు గవర్నర్ వ్యవస్థను తప్పుపడుతూనే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా హైకోర్టు ఆదేశాలతో అనివార్యమైంది.

గవర్నర్ వ్యవస్థను తప్పుపడుతూ ఇప్పటికే మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు అనేక సందర్భాల్లో కామెంట్లు చేశారు. రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని, బీజేపీ కార్యాలయంగా మార్చారని, పాలిటిక్స్ చేయాలనుకుంటే గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకుని జెండా కప్పుకోవాలంటూ విమర్శలు చేశారు. రాజ్‌భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి సహా మంత్రులెవరూ హాజరుకావడంలేదు. తగిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం ఇవ్వడంలేదంటూ గవర్నర్ సైతం మీడియా సమావేశాల్లో వాపోయారు. గవర్నర్ వ్యవస్థను తప్పుపట్టే అభిప్రాయంలో బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి మార్పు లేనప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడానికి అవకాశం కల్పించక తప్పలేదు.

పార్లమెంటులో గవర్నర్ వ్యవస్థమీద తీవ్ర స్థాయిలో చర్చ లేవనెత్తాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడానికి పేర్కొన్న కారణాల్లో గవర్నర్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత కూడా ఒకటి. తెలంగాణలోనే కాక కేరళ, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ తదితర బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న పలు రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయంటూ ఎంపీలకు ఆ సమావేశంలో కేసీఆర్ వివరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం గురించి విమర్శలు వస్తే హైకోర్టును ఆదేశాన్ని కారణంగా చూపించడం మినహా గులాబీ నేతలకు మరో మార్గం లేకుండా పోయింది. రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న తమిళిసైకు తగిన ప్రోటోకాల్ కల్పించడం లేదనే విమర్శలు ఉండనే ఉన్నాయి. స్వయంగా ఆమె మీడియా ముఖంగానే ఆవేదన వెళ్ళగక్కారు.

హైకోర్టు ఆదేశంతో ఇప్పుడు గులాబీ నేతలు అటు గవర్నర్‌ను విమర్శించలేక, మౌనంగా ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. నిన్నమొన్నటి వరకూ ఆమెను వ్యక్తిగతంగానే దూషించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు డైలమాలో పడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె ప్రసంగం వరకు మాత్రమే గవర్నర్ వ్యవస్థ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుందా లేక ఇక నుంచి వైఖరిని మార్చుకోనున్నదా అనే సందేహం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఢిల్లీలో ఒకలాగ, రాష్ట్రంలో మరో లాగ వ్యవహరించడం ఆ పార్టీ నేతలను సంకటంలోకి నెట్టింది.

Also Read...

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్?


Next Story