Kavitha vs BRS: మరి ఆ పేరెందుకు మార్చావ్? కవితపై బీఆర్ఎస్ శ్రేణుల ఎటాక్.. కేసీఆర్ స్పందిస్తారా?

by Prasad Jukanti |   (  Updated:2026-01-05 11:28:53  IST  )

కవిత చేసిన తాజా వ్యాఖ్యలు బీఆర్ఎస్‍లో సంచలనంగా మారింది.

Kavitha vs BRS: మరి ఆ పేరెందుకు మార్చావ్? కవితపై బీఆర్ఎస్ శ్రేణుల ఎటాక్.. కేసీఆర్ స్పందిస్తారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ లో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని ప్రజల పక్షాన నేను మాట్లాడితే తనను కక్ష కట్టి బయటకు పంపించివేశారని మండలిలో కవిత చేసిన కామెంట్స్ రాజకీయంగా సెన్సేషనల్ గా మారాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ఈ విషయాన్ని తాను ఆనాడే అడ్డుచెప్పానని కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ (BRS Party) శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు తనకు తెలియదని ఈ మార్పును నేను ఒప్పుకోలేదని అనడం సబబు కాదని, పేరు మార్చడం మీకు ఇష్టం లేకపోతే మరి తెలంగాణ జాగృతి పేరును (Telangana Jagruthi) భారత్ జాగృతిగా ఎందుకు మార్చారో చెప్పగలరా?అని ప్రశ్నిస్తున్నారు. అలాగే 2022 డిసెంబరు 9న తెలంగాణ భ‌వ‌న్‌లో జరిగిన భార‌త్ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌ల్లో భాగంగా బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్, పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు కవిత తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లపై 'జననేతకు జయహారతి. న్యూ స్టార్ట్, న్యూ మిషన్ బై ద లీడర్ విత్ ఏ విజన్, కేసీఆర్ గారు. విజయీభవ జై భారత్ జై తెలంగాణ' అని రాస్తు కేసీఆర్ కు వీరతిలకం దిద్దిన ఫోటోను కవిత షేర్ చేశారు. నాడు కవిత చేసిన ఈ పోస్టును బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నాయి.

కేసీఆర్ స్పందిస్తారా?

కవిత విషయంలో ఇప్పటి వరకు నేరుగా ఎలాంటి రియాక్షన్ ఇవ్వని గులాబీ బాస్ కేసీఆర్ తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. కవిత అంశాన్ని వదిలేయాలని ఎవరు ఆమెను పట్టించుకోవద్దని కేసీఆర్ పార్టీ శ్రేణులకు గతంలో ఆదేశాలు ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ ఆదేశాల మేరకే కవిత విషయంలో అడపాదడపా పార్టీ నేతలు స్పందించినా కేటీఆర్, హరీశ్ రావు స్పందించలేదనే చర్చ ఉంది. కానీ ఇవాళ కవిత సభలో ఆన్ రికార్డుగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, పార్టీలో జరిగిన అంశాలను వివరించారు. కంట తడిపెట్టుకుంటూ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ దాడితో ఇబ్బందులు పడుతున్న కారు పార్టీకి ఇప్పుడు కవిత చేసిన ఆరోపణలు కొత్తు చిక్కులుగా మారాయి. ఈ నేపథ్యంలో కవిత ఆరోపణలకు ఇకనైనా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.

శ్రేణులకు కన్ఫ్యూజన్:

కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ ఇప్పటికీ కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆమె విషయంలో పూర్తి స్థాయిలో ఎటాక్ చేయవచ్చా లేదా అనేది సస్పెన్స్ గానే ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక తనకు బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ వేదికగానే కవిత కుండబద్దలు కొట్టేశారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం సైతం కవిత ఆరోపణలను తిప్పికొట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి కేసీఆర్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తన కూతురు అనే రిలేషన్ చూస్తారా లేక పార్టీ కోసం రియాక్షన్ ఇస్తారా అనేది కాలమే సమాధానం చెప్పనుంది. మరోవైపు కవిత చేసిన తాజ్యా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు కేంద్ర బిందువుగా మారబోతోంది అనేది కూడా ఆసక్తిని పెంచుతోంది.

Read More : మండలిలో నేరుగా రాజీనామా పత్రాన్ని అందజేసిన కవిత

కూర్చున్న కొమ్మనే కవిత నరుక్కుంటున్నారు: బీఆర్ఎస్ మహిళా నేతలు ఫైర్

Next Story