BRS: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం..! గ్రాడ్యుయేట్ స్థానంలో పోటీకి ‘నై’

by Kema Shiva Kumar |

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ చేతులెత్తేసింది.

BRS: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం..! గ్రాడ్యుయేట్ స్థానంలో పోటీకి ‘నై’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ చేతులెత్తేసింది. గ్రాడ్యుయేట్, టీచర్స్ సెగ్మెంట్లలో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పార్టీ అగ్రనేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే.. మరో పక్షం రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నా.. ఎలాంటి హడావుడి లేదు. ఇప్పటికీ ఒక్కసారి కూడా సమీక్షలు నిర్వహించలేదు. అభ్యర్థి ఎంపిక, విజయానికి ప్రణాళికలు, ఓటరు నమోదు ఇలా దేని గురించీ పట్టించుకోలేదు. సమీక్షించలేదు. దీంతో పోటీకి దూరంగా ఉంటున్నట్టు పార్టీ నాయకులు కూడా ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, దీనిపై పార్టీ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది.

సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు

కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంపై మొదట్లో బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది. ఆ తర్వాత అంతర్గత సర్వేలు నిర్వహించింది. ఇందులో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. పోటీ చేసి ఓడిపోతే ఆ తర్వాత పరిణామాలు ఇంకా దిగజారిపోతాయని, దీంతో పోటీకి దూరంగా ఉండడమే బెటర్ అని డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. అందుకే అధికార కాంగ్రెస్, ప్రత్యర్థి బీజేపీలు అభ్యర్థుల ప్రకటనపై నిర్ణయాలు తీసుకుంటున్నా.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల గురించి అసలు పట్టించుకోనట్టు తెలుస్తున్నది.

అంతే కాకుండా పార్టీ నుంచి సీరియస్‌గా పోటీ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతున్నది. పార్టీ ఖర్చు పెట్టుకుంటేనే తాము పోటీ చేస్తామని పలువురు అంతర్గతంగా చెప్పినట్లు సమాచారం. ఆర్థిక భారం, గెలవకపోతే ఇంకా పార్టీ పరువు పోతుందని, గెలిచినా ఆ ఎమ్మెల్సీ పార్టీలో ఉంటాడో? అధికార పార్టీలోకి పోతాడో? తెలియదని.. అందుకే పోటీకి చేయకపోవడమే బెటర్ అని పార్టీ అగ్ర నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. ఒక వేళ గెలిచినా.. ఆ ఎమ్మెల్సీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే అది మరీ ఇబ్బందికరంగా ఉంటుందని అంచనా వేసినట్లు సమాచారం. అందుకే పార్టీ భవిష్యత్ పరిణామాల దృష్ట్యా పోటీ చేయకపోవడం మంచిదని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

యువత దూరం

అధికారం కోల్పోయాక.. యువత, నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ అంటూ బీఆర్ఎస్ హడావుడి చేసింది. నిరుద్యోగ యువతను తమ తిప్పుకోవడానికి ప్రయత్నించింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రిక్రూట్ మెంట్లు చేపట్టింది. వివాదాలకు తావు లేకుండా పరీక్షలు చేపట్టింది. నియామక పత్రాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పట్ల యువతలో సానుకూలంగా వాతావరణ ఏర్పడింది. సర్వేల్లో కూడా ఈ విషయం స్పష్టమైనట్టు చర్చ జరుగుతున్నది. అందుకే బీఆర్ఎస్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్ల నమోదు గురించి పట్టించుకోలేదని తెలుస్తున్నది.

‘గ్రాడ్యుయేట్’ జిల్లాల్లో బీఆర్ఎస్ అగ్రనేతలు

గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీకి సంబంధించిన నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఆర్.సత్యనారాయణ, స్వామిగౌడ్ లు ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ముఖ్య నేతలు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఉన్నారు. అయినా కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వెనకడుగు వేస్తుండడం గమనార్హం. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉంటారని భావించిన ఆ పార్టీ పోటీకి వెనుకంజ వేసింది. కానీ అదే ఫార్ములాను ఈ సారి అమలు చేయాల్సి ఉండగా.. పోటీ చేయకుండానే పలాయనం చిత్తగిస్తుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story