చరిత్ర చెబుతున్న నాణాలు.. కోటిలింగాల్లో విక్టోరియా నాణేల గాధ..

by Bhanu |   (  Updated:2025-06-22 12:26:01  IST  )

కోటిలింగాల… శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రాంతం. ఈ మహానగరమైన కట్టడాలు, నాణాలు, విగ్రహాలతో నిండిన ఘనమైన శకాన్ని తానెరుగుతోందని 1979 నుంచి 2009 వరకు జరిగిన పురావస్తు తవ్వకాల్లో వెలుగు చూసింది.

చరిత్ర చెబుతున్న నాణాలు.. కోటిలింగాల్లో విక్టోరియా నాణేల గాధ..
X

దిశ, వెల్గటూర్ : కోటిలింగాల… శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రాంతం. ఈ మహానగరమైన కట్టడాలు, నాణాలు, విగ్రహాలతో నిండిన ఘనమైన శకాన్ని తానెరుగుతోందని 1979 నుంచి 2009 వరకు జరిగిన పురావస్తు తవ్వకాల్లో వెలుగు చూసింది. 2000 ఏళ్ల పురాతన వస్తువుల తవ్వకాల్లో లభ్యమై మన చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్న కోటిలింగాల, తర్వాత బడ్జెట్ లోటుతో తవ్వకాలు ఆపేయడంతో మట్టి దిబ్బల మధ్య మరుగున పడింది.

అయితే, తాజాగా వెల్గటూర్ మండలంలోని గోదావరి తీరంలో మళ్లీ చరిత్ర కదలిక చూపించింది. కోటిలింగాల ఆలయ తూర్పున గోదావరి సంగమ ప్రాంతంలో చేపలు పట్టే ఓ జాలర్‌కు కొన్ని రోజుల క్రితం కొన్ని నాణాలు దొరికాయి. కొత్తవి అనుకొని వాటిని స్థానిక మాజీ సర్పంచ్ బండమీది ముత్తయ్యకు అప్పగించడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాణాలపై ఉన్న ఆకృతి, రాతల ఆధారంగా ఇవి బ్రిటిష్ కాలం నాటివని, 1911 సంవత్సరం, విక్టోరియా మహారాణి చిత్రం, గుర్రంపై రాజు బొమ్మ వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ అసాధారణ కనుగొనుగోలు కోటిలింగాల ప్రాచీనతపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. శాతవాహనుల కాలం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యానికి దారితీసే ఈ చరిత్ర పరంపర ఇంకా ఎన్నో రహస్యాలు మట్టిలో దాగి ఉంటాయనే అభిప్రాయంతో మేధావులు, కవులు, కళాకారులు మళ్లీ గళం విప్పుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కోటిలింగాల ప్రాముఖ్యతను గుర్తించి, పూర్తి స్థాయిలో తవ్వకాలు ప్రారంభించి శాతవాహనుల వారసత్వాన్ని భావితరాలకు అందించాలన్న డిమాండ్‌ మళ్లీ జోరుగా వినిపిస్తోంది. “పూర్వ చరిత్రను మనం గుర్తించకపోతే, భవిష్యత్‌ పౌరులు మమ్మల్ని గుర్తించరు,” అంటూ కళాకారులు హెచ్చరిస్తున్నారు.

Next Story