ఇందిరా క్యాంటీన్లలో ఇకపై బ్రేక్ ఫాస్ట్, లంచ్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-09 18:18:52  IST  )

గ్రేటర్ హైదరాబాద్ లో ఎంతో మంది ఆకలి తీర్చుతున్న రూ.5 భోజన పథకం..ఇక నుంచి టిఫిన్స్, మిల్లెట్ టిఫిన్స్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇందిరా క్యాంటీన్లలో ఇకపై బ్రేక్ ఫాస్ట్, లంచ్
X

దిశ, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో ఎంతో మంది ఆకలి తీర్చుతున్న రూ.5 భోజన పథకం..ఇక నుంచి టిఫిన్స్, మిల్లెట్ టిఫిన్స్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఇందిరా క్యాంటీన్లుగా మార్చడంతోపాటు వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం మాత్రమే అందిస్తుండగా.. దాంతో పాటు ఉదయం పూట టిఫిన్స్ అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతోపాటు గతంలో మధ్యాహ్నారూ.5లకే భోజనంఅందిస్తున్న వాటి నిర్వహణ అధ్వాన్నంగా ఉన్నది. వీటిని పూర్తి స్థాయిలో మార్చాలని, ప్రతి క్యాంటీన్ లో కూర్చొని తినే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

2013లో ప్రారంభమై..

నగరంలోని చిరు వ్యాపారులు, అడ్డా కూలీలు, నగరానికి వివిధ పనులపై వచ్చే వారికి తక్కువ ధరలో భోజనం అందుబాటులో ఉండేలా 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు భోజన పథకాన్నిమొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించింది. రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, అడ్డాకూలీలు ఉండే ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలో 150 కేంద్రాల్లో ప్రతీ రోజూ సుమారు సుమారు 30వేల మంది భోజనం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 12కోట్ల మందికి భోజనం అందించారు. 150 కేంద్రాలకుగాను ప్రస్తుతం 128 కేంద్రాల్లో మాత్రమే భోజనం అందిస్తున్నారు. మిగిలిన కేంద్రాల్లో మరమత్తుల కారణంగా తాత్కాలికంగా నిలిపేశారు.

రూ.5లకే భోజన పథకం ఇలా..

జీహెచ్ఎంసీ పరిధిలో అందిస్తున్న రూ.5 భోజనంలో 400గ్రాముల రైస్, సాంబారు 120 గ్రాములు, సబ్జీ 100గ్రాములు, పికిల్ 15గ్రామలు అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి రూ.27.63 ఖర్చు చేస్తున్నారు. దీనిలో రూ.5 లబ్దిదారులు చెల్లిస్తుండగా మిగిలిన రూ.24.83లను జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ఈ పథకానికి ప్రతీ ఏటా జీహెచ్ఎంసీ సుమారు రూ. 15 కోట్లు ఖర్చు చేస్తోంది. పదేండ్ల కాలంలో సుమారు రూ.247కోట్లు ఖర్చు చేయడంతోపాటు 12కోట్లకుపైగా మందికి భోజనాలు అందించారు. రూ.5భోజనానికి సంబంధించిన రేటును త్వరలోనే రూ.29.83లకు పెంచనున్నారు.

టిఫిన్స్ సైతం…

ఇందిరా క్యాంటీన్లలో ఇక నుంచి టిఫిన్స్, మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు. ఉదయం టిఫిన్లలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, మైసూర్ బజ్జీ, పూరీలు, పొంగల్ వంటిని అందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. టిఫిన్‌ను కూడా ప్రజలకు రూ.5లకే అందించాలని బల్దియా నిర్ణయించింది. ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం మొత్తం 19 రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీనిలో జీహెచ్ఎంసీ వాటాగా రూ.14 చెల్లించాల్సి ఉంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు అందించేందుకు హరిక‌ృష్ణా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి రూ.10కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతి రోజూ 25వేల మంది టిఫిన్స్ అందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇందిరా క్యాంటీన్లకు సొబగులు..

ఇందిరా క్యాంటీన్ల రూపురేఖలు మార్చేందుకు జీహెచ్ఎంసీ డిజైన్లు రూపొందించింది. గతంలో మురికికూపంగా కేంద్రాలను మోడ్రన్ గా మార్చాలని నిర్ణయించారు. లబ్దిదారులు కూర్చొని తినే విధంగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 150 కేంద్రాలకుగాను 40కేంద్రాల్లో ఇందిరా క్యాంటీన్లను 40 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు ఒక మోడల్‌లో, 99కేంద్రాల్లో 20ఫీట్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పుతో మరో మోడల్‌ను రూపొందించారు.వీటితోపాటు మరో 11 కేంద్రాలను మరమత్తులు చేయాలని నిర్ణయించారు. 150 కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి సుమారు రూ.10.7కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రతి ఇందిరా క్యాంటీన్ కు నల్లా కనెక్షన్, కరెంట్, డ్రెయినేజీ కనెక్షన్లను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Next Story