- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మళ్లీ మినీ సమ్మర్ పరిస్థితులు
జులైలో వర్షపు చినుకులతో చల్లటి గాలులతో వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం లేకుండా ఎండలు మళ్లీ దంచికొట్టనున్నాయి.

- ఈ నెల 15 వరకు అధికంగా ఉష్ణోగ్రతల ప్రభావం
- 12-15 మధ్య 40 డిగ్రీల వరకు నమోదు కానున్న ఉష్ణోగ్రతలు
- హైదరాబాద్‌కూ తప్పని హీట్ ఎఫెక్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: జులైలో వర్షపు చినుకులతో చల్లటి గాలులతో వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం లేకుండా ఎండలు మళ్లీ దంచికొట్టనున్నాయి. రాష్ట్రంలో తీవ్రమైన బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నేటి నుండి జూలై 15 వరకు రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని, మళ్లీ మినీ సమ్మర్ రోజులు రాబోతున్నాయని తెలిపారు. ఎల్ నినో ప్రభావం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో రాగల ఐదు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
జూలై 12 నుంచి తీవ్రత అధికం
గురువారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. సూర్యాపేట జిల్లా చేవెళ్లలో అత్యధికంగా 38.2 డిగ్రీ సెల్సియస్ ల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా సుమారు 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యాయి. జూలై 10 నుంచి 15 మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా జూలై 12 నుంచి 15 వరకు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 37 నుండి 40 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో సైతం ఉష్ణోగ్రతలు 35 నుండి 37 డిగ్రీ సెల్సియస్ వరకు చేరి, జనాలను ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా అక్కడక్కడా స్థానికంగా మేఘాలు పట్టి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, జూలై నెల సగటు వర్షపాతంతో పోలిస్తే చాలా తక్కువ శాతమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.






