ఘనంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్విజ బాలోత్సవం

by velandi.Saikiran |

లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ నిత్యం ఆశీర్వచనాలు అందజేసే బ్రాహ్మణ జాతిని గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని శృంగేరి శంకరమఠం చైర్మన్ బ్రహ్మశ్రీ జంధ్యాల వెంకటేశ్వరులు ఉద్ఘాటించారు.

ఘనంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్విజ బాలోత్సవం
X

దిశ,తెలంగాణ బ్యూరో: లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ నిత్యం ఆశీర్వచనాలు అందజేసే బ్రాహ్మణ జాతిని గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని శృంగేరి శంకరమఠం చైర్మన్ బ్రహ్మశ్రీ జంధ్యాల వెంకటేశ్వరులు ఉద్ఘాటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ద్విజ బాలోత్సవం పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. ఈ సంద్బంగా జంధ్యాల వెంకటేశ్వరులు మట్లాడుతూ.. కేవలం చదువు ద్వారానే భుక్తి లభిస్తుందని, విద్యతో పాటు ఇతర సాంస్కృతిక, కళారంగాల్లోనూ చిన్నారులు రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన అన్నారు.నేటితరం చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలవుతూ చదువు కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువ ఆసక్తి చూపుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఆ అలవాటును మానుకుని, నాట్యం, సంగీతం, మిమిక్రీ లాంటి కళలను నేర్చుకుంటూ నిరంతరం సాధన చేయాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన సినీ నటుడు తేజోమూర్తుల మురళీధర్ మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో ఉన్న సహజసిద్ధమైన ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.

చిన్నారులు చిన్నతనంలో ఎంత కష్టపడితే భవిష్యత్తులో అంత సుఖపడతారని, పిల్లలకు కచ్చితమైన క్రమశిక్షణను నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని టీవీ అశోక్ కుమార్, సుబ్రహ్మణ్యేశ్వర రావు సూచించారు. ఏడాదికి ఒక్కసారైనా పిల్లలందరినీ ఇలా ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారికి బ్రాహ్మణత్వం విశిష్టతను తెలియజేయాలని మరో అతిథి శివకుమార్ కోరారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాసులు మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తోందని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. మనోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో.. చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి, సంగీతం, చిత్రలేఖనం, వక్తృత్వం, భగవద్గీత శ్లోకాలు తదితర పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 115 మంది చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పావని శర్మ, ప్రతినిధులు చోడవరపు శ్రీనివాస్, వెంకట రామారావు, రంగారావు, ఉజ్వల, శారద, అవ్వా విజయలక్ష్మి, రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story