బాస్ డీపీ చూసి నమ్మాడు.. రూ.4.70 కోట్లు పోగొట్టుకున్న ఉద్యోగి : శిఖా గోయెల్‌

by Ramesh Naini |

వాట్సాప్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫొటో, పేరుతో నకిలీ ఖాతా సృష్టించి ఏకంగా రూ.4.70 కోట్లు కొల్లగొట్టిన భారీ బాస్ వాట్సాప్ ఫ్రాడ్ ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించిందని డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడించారు.

బాస్ డీపీ చూసి నమ్మాడు.. రూ.4.70 కోట్లు పోగొట్టుకున్న ఉద్యోగి : శిఖా గోయెల్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: వాట్సాప్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫొటో, పేరుతో నకిలీ ఖాతా సృష్టించి ఏకంగా రూ.4.70 కోట్లు కొల్లగొట్టిన భారీ బాస్ వాట్సాప్ ఫ్రాడ్ ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించిందని డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడించారు. ఈ కుంభకోణంలో సైబర్ నేరగాళ్లకు కమీషన్ల ఆశతో బ్యాంకు ఖాతాలను సరఫరా చేసిన ఇద్దరు కీలక ఏజెంట్లను కూడా అరెస్ట్ చేసినట్లు బుధవారం ఆమె ప్రకటించారు.

బాస్ నుంచే వచ్చిన మెసేజ్ అని నమ్మి.. రూ.4.70 కోట్లు బదిలీ

ఈ సందర్భంగా డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ.. ఓ ప్రముఖ కంపెనీ ఎండీ వాట్సాప్ డీపీ తో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాను సృష్టించారు. దాని నుంచి ఆ కంపెనీకి చెందిన ఓ బాధ్యతాయుతమైన అధికారికి మెసేజ్ చేశారు. తాను అత్యవసర మీటింగ్‌లో ఉన్నానని, వెంటనే తాను పంపిన బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేయాలని ఆదేశించారు. అది నిజంగా తమ బాస్ నుంచే వచ్చిన మెసేజ్ అని నమ్మిన ఆ బాధితుడు విడతల వారీగా ఏకంగా రూ.4.70 కోట్లు వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేసి మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మా బృందాలు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి, హైదరాబాద్ కొత్తపేటలో ఉంటున్న మందవల్లి శివ నాగరాజు లను అరెస్ట్ చేశాయి అని ఆమె తెలిపారు. అరెస్టయిన ఇద్దరు నిందితులు సైబర్ నేరగాళ్లకు నేరుగా కరెంట్ ఖాతాలను విక్రయిస్తూ దాదాపు రూ.24 లక్షల కమీషన్ తీసుకున్నట్లు శిఖా గోయెల్ వెల్లడించారు.

బాధితుడు పంపిన సొమ్ములో రూ.1.80 కోట్లు నేరుగా శివ నాగరాజు ఖాతాలోకే చేరాయన్నారు. ఈ ఖాతాను కృష్ణసాయే నేరగాళ్లకు సమకూర్చాడని తెలిపారు. నిందితుల బ్యాంకు లావాదేవీలను విశ్లేషించగా.. ఒక్క శివ నాగరాజు ఖాతాలోనే మొత్తం రూ.2.49 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఖాతాకు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నమోదైన సైబర్ కేసులతో సంబంధం ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని ఆమె తెలిపారు.

క్రాస్ చెక్ చేసుకోండి..

ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు, ప్రైవేటు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని శిఖా గోయెల్ హెచ్చరించారు. వాట్సాప్‌లో మీకు తెలిసిన వ్యక్తుల ఫొటో లేదా పేరు కనిపించగానే అది వారిదే అని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైనా అత్యవసరంగా డబ్బులు అడిగితే, వెంటనే స్పందించకుండా వారికి నేరుగా ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో వాట్సాప్ మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రామాణికంగా తీసుకోవద్దు అని ఆమె సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని శిఖా గోయెల్ విజ్ఞప్తి చేశారు.

Next Story