హైదరాబాద్‌లో ముగిసిన బోనాలు.. రేపే గ్రాండ్‌గా ఘటం ఊరేగింపు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌ మహానగరంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు ఈ సంవత్సరం జూన్ 26న గోల్కొండ కోటలోని శ్రీజగదంబిక అమ్మవారి ఆలయంలో బంగారు బోనంతో ప్రారంభం కాగా.. ఆదివారం సింహవాహిని బోన సమర్పణతో ముగిశాయి.

హైదరాబాద్‌లో ముగిసిన బోనాలు.. రేపే గ్రాండ్‌గా ఘటం ఊరేగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మహానగరంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు ఈ సంవత్సరం జూన్ 26న గోల్కొండ కోటలోని శ్రీజగదంబిక అమ్మవారి ఆలయంలో బంగారు బోనంతో ప్రారంభం కాగా.. ఆదివారం సింహవాహిని బోన సమర్పణతో ముగిశాయి. అయితే బోనాల అనంతరం, జులై 21న హంపి నుండి తీసుకొచ్చిన లక్ష్మి ఏనుగుపై అమ్మవారి ఘటం ఊరేగింపు డప్పు నృత్యాలు, పోతరాజు ప్రదర్శనలతో వైభవంగా జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర దేవదాయశాఖ అధికారులు సకల ఏర్పాటు చేశారు. చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో మొదలైన బోనాల ఉత్సవాలు దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి, పర్యవేక్షణతో నెల రోజుల పాటు జరిగిన బోనాల(Bonalu) ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ గడ్డమీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుందనీ సురేఖ చెప్పారు. తెలంగాణ సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మకత ఉట్టిపడిందనీ వివరించారు. గోల్కొండలో మొదటి బోనంతో ప్రారంభమైన ఆషాఢ బోనాల జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల ఘటం ముగుస్తుందనీ గుర్తుచేశారు.

కాగా, బోనాల ఉత్సవాలు విజయంతం కావడానికి కృషి చేసిన దేవాదాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఇతర శాఖల అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ సందర్భంగా గత సంవత్సరం కంటే ఈసారి బోనాలకు అధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కి మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Next Story