జూలై 1 కళ్యాణోత్సవం.. అధికారులకు పక్కా సూచనలు చేసిన మంత్రి పొన్నం

by Bhanu |   (  Updated:2025-06-16 10:52:23  IST  )

తెలంగాణ సంప్రదాయాన్ని చాటే బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం, రథోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి , హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

జూలై 1 కళ్యాణోత్సవం.. అధికారులకు పక్కా సూచనలు చేసిన మంత్రి పొన్నం
X

దిశ, హైదరాబాద్ దిశ, బ్యూరో : తెలంగాణ సంప్రదాయాన్ని చాటే బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం, రథోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి , హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూలై 1న ఎల్లమ్మ తల్లి కళ్యాణం, రథోత్సవం జరగనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. గత సంవత్సరం బారికేడ్లు, క్యూలైన్లలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

మహిళలు, చిన్నపిల్లలకు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, భద్రత కోసం ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సుందరీకరణ చేయాలని సూచించారు. భక్తుల కోసం ఉచిత ఫ్యూరిఫైడ్ మంచినీటి సరఫరా, అదనంగా వాటర్ ట్యాంకర్లు, ఆరోగ్య శిబిరాలు, అంబులెన్స్‌లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ, ఎల్‌ఈడి స్క్రీన్ల ద్వారా భక్తులకు సమాచారం అందించాలన్నారు.

కళ్యాణం, రథోత్సవం నాడు సమాచార శాఖ, పోలీస్, రెవెన్యూ, జిహెచ్ఎంసి, దేవాదాయ శాఖ అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావు, కార్పొరేటర్ సరళతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story