‘బాడీ షేమింగ్’ వ్యాఖ్యల కలకలం.. ఆ ఇద్దరిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు!

by Kema Shiva Kumar |

మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌పై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహంగా ఉన్నారు.

‘బాడీ షేమింగ్’ వ్యాఖ్యల కలకలం.. ఆ ఇద్దరిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌పై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ ఇద్దరు తనను బాడీ షేమింగ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని స్వయంగా కలిసి, తనకు జరిగిన అవమానాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనను ఉద్దేశించి పొన్నం చేసిన కామెంట్స్, వివేక్ వ్యవహరించిన తీరును ఆధారాలతో తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొన్నం సృష్టిస్తున్న వర్గపోరును పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది.

పొన్నం వల్లే జిల్లాలో పార్టీ ఖాళీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం తీరు వల్లే పార్టీ చాలా సమస్యల్లో ఇరుక్కుందని మంత్రి లక్ష్మణ్ తన సన్నిహితులతో కామెంట్ చేసినట్లు తెలిసింది. ‘పొన్నం వల్లే జిల్లాలో పార్టీకి కేడర్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరితో క్లోజ్‌గా ఉన్నారో మాకు తెలుసు. ఆయనకు శక్తి ఉంటే నియోజకవర్గం వదిలిసే ఇతర నియోజకవర్గానికి ఎందుకు వెళ్లారు? నాతో పాటు, శ్రీధర్ బాబు అంటే పొన్నంకు గిట్టదు. నేను ఓడినా, గెలిచినా పార్టీకి లాయల్‌గా ఉన్నాను. అప్పుడు, ఇప్పుడు ధర్మపురిలో ఉన్నాను. ఎప్పటికీ అక్కడే ఉంటాను’ అని కామెంట్ చేసినట్లు తెలిసింది.

వివేక్ అహంకారి!

పొన్నం తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడే ఉన్న మంత్రి వివేక్ సర్దిచెప్పాల్సింది పోయి, మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించినట్లు లక్ష్మణ్ తనను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో కామెంట్ చేసిననట్లు సమాచారం. ‘మీరు నాకు మద్దతుగా వచ్చినందుకు థ్యాంక్స్. కానీ ఎలాంటి ఆందోళనలు చేయొద్దు. అది పార్టీకి మంచిది కాదు. వివేక్‌కు డబ్బు ఉందని అహంకారం ఎక్కువ. నాకు మంత్రి పదవి రావడాన్ని ఆయన జీర్ణించుకోట్లేదు. ఇప్పటి వరకు ఆయన కనీసం విషెస్ కూడా చెప్పలేదు. పైకీ మాత్రం దళితుల గురించి మాట్లాడుతారు’ అని కామెంట్ చేసినట్లు తెలిసింది.

ఆ కామెంట్స్ పార్టీకి నష్టం: మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి పొన్నం చేసిన కామెంట్స్‌ గురించి మంత్రి శ్రీధర్ బాబు వద్ద తన సన్నిహితులు ప్రస్తావించగా ‘బహిరంగంగా కామెంట్స్ చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం. సహచర మంత్రిపై పొన్నం చేసిన కామెంట్స్‌పై పార్టీ నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ ఇమేజ్ కాపాడే బాధ్యత అందరిది. సొంత జిల్లా అనే చెప్పుకునే వాళ్లు ఇతర చోటుకు వెళ్లి ఎందుకు పోటీ చేయాలి’ అని శ్రీధర్ బాబు కామెంట్ చేసినట్లు తెలిసింది.

Next Story