- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పచ్చని అడవుల్లో రుధిర చారికలు.. 2004 శాంతి చర్చలకు హాజరైన అగ్రనేతలు మృతి
పచ్చని అడవులు రుధిరంతో ఎరుపెక్కుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పచ్చని అడవులు రుధిరంతో ఎరుపెక్కుతున్నాయి. గుట్టల నడుమ తుపాకులు గర్జన చేస్తున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు శక్తికి మించి పోరాడుతుంటే.. మరోవైపు వచ్చే ఏడాది నాటికి మావోయిస్టుల మాట వినబడకుండా వారిని సమూలంగా అంతమొందించాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మెప్పేట దాడిని కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు అగ్ర నేతలను టార్గెట్‌గా చేసుకుని సాయుధ బలగాలు గురి చూసి ఎటాక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో బుల్లెట్ దెబ్బలకు విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ‘ఆపరేషన్ కగార్’ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 200పైగా మావోయిస్టులు మరణించారు. ఇదే సమయంలో దండకారణ్యంలో భద్రతా బలగాల చేపడుతోన్న మారణహోమాన్ని వెంటనే నిలిపివేయాలని పలు ప్రజాసంఘాల నాయకులు, పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నాడు కాల్పుల విరమణకు ఒప్పందం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఆ ఎలక్షన్‌లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. మే నెలలో సీఎంగా వైఎస్ ముఖ్యమంత్రి బాధ్యతలు చెపట్టిన తర్వాత మూడు నెలలకే మావోయిస్టులతో కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక 1992లో మావోయిస్టులపై విధించిన బ్యాన్‌ను సైతం ఎత్తవేసింది. ఆ వరుస పరిణామాలతో ప్రభుత్వంతో శాంతి చర్చలకు సహృద్భావ వాతావరణం ఏర్పడింది.
శాంతి చర్చలు హాజరైన మావోయిస్టు అగ్రనేతలు..
ఎట్టకేలకు ప్రభుత్వంతో మావోయిస్టుల శాంతి చర్చలకు సమయం ఎట్టకేలకు రానే వచ్చింది. 2004, అక్టోబర్ 15 నుంచి 18 వరకు నాటి హోంమంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చర్చలు జరిగాయి. ఈ భేటీకి సీపీఐ (మావోయిస్ట్) నాయకులైన అక్కిరాజు హరగోపాల్ రామకృష్ణ (ఆర్కే), చలం అలియాస్ సుధాకర్, గాజర్ల రవి అలియాస్ గణేశ్, జనశక్తి నేత రియాజ్, కూర దేవేందర్ అలియాస్ అమర్ లు హాజరయ్యారు. వారితో హోంమంత్రి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సమావేశంలో భాగంగా గిరిజన భూముల రక్షణ, భూ సంస్కరణలు, గిరిజన హక్కులు ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ, దళితులకు సామాజిక న్యాయం. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు, మైనారిటీల రక్షణే ప్రధానాంశాలుగా చర్చలు జరిగాయి.
చర్చలు విఫలం.. మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధం
ప్రభుత్వంతో మావోయిస్టుల శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరడంతో అందుకు వారు అంగీకరించ లేదు. శాంతి చర్చలు ముగిసిన మరుసటి రోజు నుంచే అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కార్ మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించింది. డీజీపీ స్వరణ్‌జీత్ సేన్ ఆదేశాల మేరకు పోలీసులు, గ్రేహౌండ్స్ సిబ్బంది వరుస కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతూ రాష్ట్రాన్ని ఎన్‌కౌంటర్లతో అట్టుడికించారు. ఈ పరిణామాలతో మావోయిస్టులకు ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతిన్నది. వరవర రావు, గద్దర్ వంటి ప్రముఖులు శాంతి చర్చలను కొలిక్కి తీసుకొద్దామని ప్రయత్నించినా విఫలయత్నమే అయింది.
ఒక్కొక్కరుగా ఎన్‌కౌంటర్లలో ఆ నలుగురు మృతి..
2004 శాంతి చర్చల్లో పాల్గొన్న మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా వరున ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు విడిచారు. 2005లోనే జనశక్తి కీలక నేత రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అనంతరం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) 2021లో అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ మరణించారు. ఇవాళ మారేడుమిల్లి-రంపచోడవరం మండలాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి (Gajarla Ravi) అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ (Uday) మృతి చెందారు. అయితే, 2004 శాంతి చర్చల్లో పాల్గొన్న ఐదుగురిలో ఒకే ఒక్కరు ప్రాణాలతో ఉన్నారు. అతడే.. జనశక్తి నేత కూర దేవేందర్ అలియాస్ అమర్. ఆయన స్వయానా భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) జనశక్తి నేత కూర రాజన్న తమ్ముడు, అరుణోదయ విమలక్కకు సహచరుడు.






