మునుగోడులో బీజేపీ కొత్త ఎత్తుగుడ.. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేలా వ్యూహం

by Disha Web Desk 4 |
మునుగోడులో బీజేపీ కొత్త ఎత్తుగుడ.. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేలా వ్యూహం
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడులో జెండా పాతేందుకు పార్టీల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. నువ్వా నేనా అన్నట్లుగా ఇక్కడ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నియోజకవర్గంలోని పార్టీ శక్తి కేంద్రాల ఇన్ ఛార్జీలతో బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యనేతలు, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ పెద్దలు కీలక దిశానిర్దేశం చేశారు. మునుగోడు గడ్డపై బీజేపీ విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పోలింగ్ బూత్ ల వారీగా ఓట్లు జారిపోకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లే ప్రణాళికను నేతలకు ఉపదేశించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపి బంపర్ మెజార్టీ దిశగా పార్టీని ముందుకు నడిపించే ప్రణాళికలను నేతలకు వివరించినట్లు తెలుస్తోంది.

ప్రతి వంద మంది ఓటర్లకు ఓ వ్యవస్థ

టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల రూపంలో లబ్దిదారులైన ఓటర్లకు గాలం వేసే అవకాశాలు ఉంటడంతో బీజేపీ మరింత పక్కా ప్రణాళిక బద్దంగా పని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎత్తుగడలను చిత్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ లోటుపాట్లను ప్రజలకు వివరించేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో సీనియర్ నేతకు 5 గ్రామాల బాధ్యతలను అప్పగించడంతో పాటుగా ప్రతి వంద మంది ఓటర్లకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా కృషి చేయాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక కోసం జాతీయ నాయకులతో సహా పార్టీలోని సీనియర్ల అందరి సేవలను ఉపయోగించుకునేలా ప్రణాళికలను రచిస్తున్నామని, మీరంతా ఒక్కొక్కరు ఒక్కో నరేంద్ర మోడీలా మారి పార్టీ విజయం కోసం పని చేయాలని ఈ సందర్భంగా పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో తాను మునుగోడులోనే మకాం వేయబోతున్నట్లు నేతలు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

రాజగోపాల్ రెడ్డి క్యాడర్ పై ఫోకస్

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి రావడంతో ఇన్నాళ్లూ ఆయన వెంట నడిచిన క్యాడర్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆయనతో పాటు కలిసి వచ్చే కాంగ్రెస్ నేతలను బీజేపీ నిరుత్సాహపరచకుండా ఉండాలని, వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడంతో పాటు ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంట వచ్చే వారిని కలుపుకుంటూ పార్టీ గెలుపుకు సమిష్టిగా కృషి చేయాలని.. ఈ బాధ్యత అంతా మీదే అని కార్యకర్తలకు బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఉన్న మనోహర్ రెడ్డి పరిస్థితి ఏంటి అని నేతలు బండి సంజయ్ తో ప్రస్తావించగా తన పాదయాత్ర బాధ్యతలు ఆయనే చూస్తున్నారని.. నేను నడుస్తున్నాను.. ఆయన నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని బదులు ఇవ్వడంతో మనోహర్ రెడ్డికి భవిష్యత్ లో పార్టీ అండగా ఉంటుందనే సంకేతాలు పార్టీ ఇస్తోందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా టీఆర్ఎస్ ను నిలవరించేలా బీజేపీ చేస్తున్న ఎత్తుగడలు మునుగోడు రాజకీయంలో కాకరేపుతోంది.


Next Story